కేంద్ర సాయంపై విస్తృతప్రచారం
వచ్చే ఎన్నికల నాటికి బలపడేందుకు బీజేపీ ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి చేస్తున్న సహాయాన్ని, అందజేస్తున్న నిధుల గురించి జిల్లా, మండల స్థాయిల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున పుస్తకాలు, కరపత్రాలు, జిల్లాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కిందిస్థాయి పార్టీ కార్యకర్తలు, ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్న విషయాన్ని చట్టసభల వేదికలపైనే అంగీ కరించడాన్ని మంచి పరిణామంగా అంచనా వేస్తోంది.
టీఆర్‌ఎస్ పట్ల సానుకూల వైఖరిని కొనసాగిస్తూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికల్లా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదిగేందుకు కలిసొచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలనే అభిప్రాయంతో ఉంది. ఈ దిశలో సంస్థాగతంగా బలపడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. పార్టీకున్న అయిదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఒక్కొక్కరు అయిదేసి జిల్లాల చొప్పున బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించారు.
జిల్లా పదాధికారుల నియామకం పూర్తి చేసి, మండలస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. పార్టీ సిద్ధాంతాలు, రాజకీయపరమైన అంశాలకు సంబంధించి జిల్లా, మండలస్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలను జనవరి 15వ తేదీ కల్లా పూర్తిచేయాలని భావిస్తున్నారు. బుధవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశంలోఈ మేరకు ఆయా అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, జి.కిషన్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, మంత్రి శ్రీనివాస్, నాగం జనార్దనరెడ్డి, పేరాల శేఖర్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్ధం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.