కేంద్ర ప్రభుత్వంలోకి టీఆర్‌ఎస్? | TRS central government? | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వంలోకి టీఆర్‌ఎస్?

Published Tue, Feb 17 2015 1:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

TRS central government?

  • రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం
  •  రెండు మంత్రి పదవులు తీసుకోనున్న గులాబీ పార్టీ
  •  ప్రతిగా రాష్ట్ర కేబినెట్‌లో బీజేపీకి రెండు బెర్తులు
  •  ఖాళీ చేయడం కోసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన
  •  రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ అవసరాల కోసం నిర్ణయం!
  •  పెదవి విప్పని ఇరు పార్టీల నేతలు
  • సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) భాగస్వామి కానుందా? రెండు కేంద్ర మంత్రి పదవులను తీసుకుని.. రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులను కేటాయించనుందా..!? దీనిపై అనూహ్య నిర్ణయం తీసుకునే  దిశలో టీఆర్ ఎస్ పయనిస్తోందా..? కొద్దిరోజులుగా రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలోనూ ఇదే తరహా ప్రచారం విస్తృతంగా సాగుతోంది.. ఇదే సమయంలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోందనే అభిప్రాయాలూ వస్తున్నాయి.
     
    కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర అధికార పీఠాన్ని ఎనిమిది నెలల కింద టీఆర్‌ఎస్ సాధారణ మెజారిటీతో దక్కించుకుంది. సుస్థిరత సాధించే యోచనతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసి బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కోసం ప్రయత్నిస్తోంది. ఇది ఫలిస్తే త్వరలోనే టీఆర్ ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాజకీయ అవసరాలతో పాటు కొత్త రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం మద్దతు, వెన్నుదన్ను అవసరమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆలస్యంగా తెలిసిందన్న విమర్శకుల మాటలకు జవాబు చెప్పేలా ఎత్తులు వేస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సినంత అవసరం బీజేపీకి లేకున్నా... తెలంగాణలో పార్టీ భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంటున్నారు.
     
    దగ్గరయ్యేందుకు తహ తహ!

    టీఆర్‌ఎస్ మూడు నాలుగు నెలలుగా కేంద్రంలోని బీజేపీ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలను వేగవంతం చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సీహెచ్ విద్యాసాగర్‌రావుకు, కేంద్ర మంత్రిగా పదవి పొందిన బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం చేసింది. ఇక ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛభారత్’ను తొలుత టీఆర్‌ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లకు సమావేశం నిర్వహించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని మార్గనిర్దేశనం చేశారు. తర్వాత ఢిల్లీలో మంత్రులతో భేటీలు, తాజాగా సోమవారం ప్రధానితో సమావేశం ద్వారా తాము పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నామన్న సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారు. కనీసం ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కావాలన్న ప్రయత్నాల్లో టీఆర్‌ఎస్ నేత ఉన్నట్లు చెబుతున్నారు.

    రాష్ట్ర కేబినెట్‌లోకి బీజేపీ..?

    మరోవైపు రాష్ట్ర మంత్రి వర్గంలోకి బీజేపీని చేర్చుకోవడం ద్వారా మైత్రీ బంధాన్ని దృఢం చేసుకునే యోచనతో గులాబీ నేతలు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మంత్రుల్లో ఇద్దరిని పార్టీ కార్యకలాపాలకు పరిమితం చేసి, ఖాళీ అయ్యే ఆ స్థానాలను బీజేపీ ఎమ్మెల్యేలతో భర్తీ చేయాలన్న వ్యూహంతో ఉన్నారని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవా కనిపించినా... తెలంగాణలో మాత్రం పనిచేయలేదు. ఆ పార్టీ కేవలం ఒకే ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. టీడీపీతో పొత్తు ద్వారా ఐదు ఎమ్మెల్యే స్థానాలతో తృప్తిపడింది. భవిష్యత్‌లోనైనా రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తిగా మలుస్తామన్న భరోసా ఆ పార్టీ నాయకత్వానికి లేదని చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలో భ విష్యత్ రాజకీయ అవసరాల కోసమైనా... అధికారం పంచుకుంటే మేలన్న భావన ఈ పార్టీ నాయకుల్లోనూ అంతర్గతంగా ఉంది. ఇక దేశంలో ‘జనతా పరివార్ ’ కూటమి బలపడకుండా కూడా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోందన్న విశ్లేషణలు అందుతున్నాయి. దీంతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలి తాల తర్వాత కమలనాథులు జాగ్రత్త పడుతూ టీఆర్‌ఎస్ లాంటి పార్టీలను చేరదీసేందుకు సుముఖంగానే ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ పరిణామాలపై ఇరు పార్టీల నేతలు నోరు మెదపడం లేదు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం త్వరలో జరగబోయే మార్పులకు అద్దం పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
     
    ఇద్దరు మంత్రులు ఔట్!


    రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఇద్దరిని పూర్తిగా పార్టీకి అంకితం చేసే ఆలోచనలో గులాబీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. వారి సేవలను పార్టీకి వినియోగించుకోవడం ద్వారా రెండు బెర్తులు ఖాళీ చేయించవచ్చని తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్‌లను ఆ స్థానాల్లో భర్తీ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వర్గంలోకి రాజ్యసభ సభ్యుడు కేశవరావు, నిజామాబాద్ ఎంపీ కవితను పంపుతారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌లో టీఆర్‌ఎస్ చేరుతుందన్న వార్తలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం ఖండించినా.. సోమవారం కూడా ఈ ప్రచారం మాత్రం తగ్గలేదు. దేశ రాజధాని కేంద్రంగా జాతీయ మీడియాలోనూ ఈ అంశం ప్రధాన వార్త కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement