మాట్లాడుతున్న అయ్యన్నగారి భూమయ్య
‘కేసీఆర్‌ది నిరంకుశ పాలన’
Published Fri, Sep 9 2016 11:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
నేరడిగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను లెక్కచేయకుండా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పాలనను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. ప్రజలను పట్టించుకోని టీఆర్‌ఎస్‌కు 2019లో పతనం తప్పదని హెచ్చరించారు.
ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములయ్యారని, ఎందరో మహానుభావులు అసువులు బాసారని, వారి త్యాగఫలితమే నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్ నాయకులు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారని, ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లింల ఓట్లు కోల్పోకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారే తప్పా ప్రజల అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకోవడంలేదని దుయ్యబట్టారు.
విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేమని, పార్టీ పరంగా నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి తెలంగాణ అమరవీరులను స్మరించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి బీజేపీకి పట్టం గడుతుందన్నారు. సమావేశంలో జిల్లా ప్రచార కార్యదర్శి మెడిసెమ్మ రాజు, కార్యదర్శి రచ్చ మల్లేష్, జిల్లా నాయకులు సామ రాజేశ్వర్‌రెడ్డి, మండల కన్వీనర్‌తీగల నవీన్ కుమార్, గంధం నవీన్ తదితరులు ఉన్నారు.
Advertisement