ఆశల పల్లకి | Hopes litter | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకి

Published Fri, Dec 27 2013 2:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

ఆశల పల్లకి - Sakshi

ఆశల పల్లకి

టీఆర్‌ఎస్... ఆత్మగౌరవ పోరు
 =గులాబీల్లో ఉత్సాహం నింపిన పంచాయతీ ఎన్నికలు
 =శిక్షణ శిబిరాలతో ముందడుగు
 
 బీజేపీ... సమరదీక్ష
 =బలోపేతం వైపు కమల దళం అడుగులు
 =ఓరుగల్లుపై రాష్ర్ట నేతల దృష్టి
 
 కాంగ్రెస్... కృతజ్ఞత సభ
 =కలిసొచ్చిన ‘సహకారం’...
 =సీడబ్ల్యూసీ తీర్మానంతో నూతనోత్తేజం
 
 టీడీపీ... పరువు కోసం పాకులాట
 =‘తమ్ముళ్ల’కు పరీక్షగా మారిన బాబు యూత్ర
 =రాజకీయ పక్షాల మూకుమ్మడి దాడితో సై‘కిల్’
 
2013... ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణ ఉద్యమం అన్ని రాజకీయ పక్షాలను అగ్నిపరీక్షకు గురిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అకుంఠిత దీక్షలతో ఓరుగల్లు వాసులు.. తమ ఆకాంక్షను మరోసారి చాటారు. పార్టీలకతీతంతగా జరిగిన సహకార, పంచాయతీ ఎన్నికలతో పల్లెలు వేడెక్కారుు. సహకార పోరులో కాంగ్రెస్, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటుకోగా... కోల్పోయిన పరువును కాపాడుకునేందుకు టీడీపీ యత్నించింది. గులాబీ దళం పట్టు సడలకుండా ప్రత్యేక రాష్ట్ర పోరు కొనసాగిస్తూనే... రానున్న సాధారణ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేసేందుకు ఉపక్రమించింది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో స్థానికంగా బలాన్ని పెంచుకునేందుకు కమల దళం శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికలతో తొలిసారిగా రంగంలోకి దిగి తన ప్రభావాన్ని చాటుకుంది. వామపక్షాల్లో ఐక్యత కొరవడడంతో ఎదురీదుతున్నారుు. తాజాగా కేంద్రం తీసుకున్న తెలంగాణ అనుకూల వైఖరితో పట్టు కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీలు తమశక్తి యుక్తులను కేంద్రీకరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కలసాకారం కానున్న తరుణంలో ఆ ఫలాలు పొందేందుకు పోటీపడుతున్నాయి.
 
 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఈ ఏడాది భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టకపోయినప్పటికీ తెలంగాణ ఉద్యమానిన్ని టీఆర్‌ఎస్ ముందుండి నడిపించింది. జిల్లాలో పట్టు పెంచుకునే యత్నం చేసింది. టీజేఏసీతో, ఇతర సంఘాలతో కలిసి నిరసననోద్యమాలు చేపట్టడంలో ముందువరుసలో నిలిచింది. ఆకస్మికంగా వచ్చిన సహకార ఎన్నికలను అంతగా పట్టించుకోకపోవడంతో నష్టపోయి అధికార పక్ష విమర్శలను ఎదుర్కొంది. ప్రథమార్థంలో తెలంగాణపై ఆశలు వదులుకున్న టీఆర్‌ఎస్ వచ్చే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచించింది. నిరసనోద్యమాలు కొనసాగిస్తూనే నియోజకవర్గ శిక్షణ శిబిరాలను ప్రారంభించి కేడర్‌ను తీర్చిదిద్దేందుకు సమాయత్తమైంది. ఈ దశలో వచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా సాధారణ ఎన్నికలకు ఇవి ట్రయల్‌గా భావించి పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమించి విజయం సాధించింది. ఇతర పక్షాలకు మరోసారి గాలం వేసి సక్సెస్ అయ్యింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌నేత కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్‌లో ప్రధాన నేతగా మారారు. శ్రీహరి చేరిన కొద్ది రోజులకు ఆయన ప్రాతినిధ్యం వహించిన స్టేషన్‌ఘన్‌పూర్‌లో భారీ సభ నిర్వహించారు. కేసీఆర్ హాజరయ్యారు. ఈ వేదిక మీది నుంచి వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం పోటీచేస్తారని ప్రకటించడం పార్టీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. యుపీఏ తెలంగాణ అనుకూల నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ విలీనం అంశం ఆ పార్టీని అంతర్గతంగా తీవ్రఆందోళనకు గురిచేసింది. ఈ సమయంలోనే పార్టీ నాయకుడు దొమ్మాటి సాంబయ్య తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. కొద్ది రోజులకే టీఆర్‌ఎస్ ఆవిర్భాం నుంచి కీలకపాత్ర నిర్వహించిన మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు, ఆ తర్వాత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ పరమేశ్వర్ పార్టీకి గుడ్‌బై చెప్పడం కలవరపరిచింది. ప్రస్తుతం విలీన చర్చ తగ్గినప్పటికీ అంశం ఇంకా  తెరపైనే ఉంది.
 
 బలం కూడగట్టుకుంటున్న బీజేపీ


 బీజేపీ బలం పెంచుకునేందుకు సర్వశక్తులొడ్డుతోంది. పార్టీ నిర్మాణాత్మకంగా తెలంగాణ ఉద్యమ ఫలాలు తమకే దక్కాలనే భావనతో ఉంది. పాత సంబంధాల పునరుద్ధరణతో పాటు కొత్త శక్తిని కూడగట్టుకునేందుకు తెలంగాణవాదాన్ని భుజానికెత్తుకుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా నాయకత్వం వరకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఆర్ట్స్ కాలేజీలో జరిగిన దీక్షలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
 
 వైఎస్సార్ సీపీ అడుగులు


 జిల్లాలో వైఎస్సార్ సీపీ తన బలాన్ని కూడగట్టుకునే యత్నం చేసింది. సహకార ఎన్నికల్లో పోటీ చేసి తన ప్రభావాన్ని కనబరిచింది. పంచాయతీ ఎన్నికలతో తొలి ఎన్నికలను చవి చూసింది. గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నది. ఎన్నికలకు ముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు జిల్లా స్థాయి కార్యకర్తలతో హన్మకొండలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరిపెడలో జరిగిన సభలో పాల్గొన్నారు. మహానేత వైఎస్సార్ అందించిన స్పూర్తితో పార్టీ నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తోంది.
 
 కాంగ్రెస్‌లో తెలం‘గానం’


 అధికారపక్షమైనప్పటికీ ఉద్యమ వేడితో నియోజకవర్గాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఏడాది కలిసొచ్చింది. ప్రారంభంలో జరిగిన సహకార ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం ఆ పార్టీకి సానుకూలంగా మారింది. ఈ ఎన్నికలు సాఫీగా ముగించినప్పటికీ చైర్మన్ ఎన్నికపై విభేదాలు నెలకొని జంగారాఘవరెడ్డి, దొంతిమాధవరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. పార్టీ నిర్ణయాన్ని కాదని క్యాంప్ నుంచి సభ్యులతో వచ్చి నామినేషన్ వేయడంతో దొంతికి అవకాశం లేకుండా పోయింది. దీనికి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతల హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల వాయిదాలపై కోర్టును ఆశ్రయించడం, ఆ పార్టీలో అంతర్గత రగడ సృష్టించింది. చివరికి కోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌గిరీ జంగాను వరించడంతో దొంతివర్గం మనస్తాపానికి గురైంది. తదుపరి కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల్లో కాలుపెట్టే యత్నం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలతో ఏకంగా రంగంలోకి దిగి తమ అభ్యర్థుల విజయానికి చెమటోడ్చారు. టీఆర్‌ఎస్‌తో నువ్వానేనా అన్నట్టుగా పోటీపడి మంచి ఫలితం సాధించారు. ఇటీవల కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడంతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఐదేళ్ల తర్వాత జేఎన్‌ఎస్‌లో నవంబర్ 9న కృతజ్ఞతసభ పేరుతో భారీసభ నిర్వహించి జనాన్ని తరలించి సక్సెస్ అయ్యారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజాదరణను పొందలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.
 
 ఎదురీతున్న ఎర్ర పార్టీలు


 ఉభయ కమ్యూనిస్టుపార్టీలు జిల్లాలో ప్రజా సమస్యలపై పోరుబాట కొనసాగిస్తున్నాయి. సీపీఐ తెలంగాణవాదాన్ని ఎత్తుకోవడం జిల్లాలో కొంత పట్టును, కేడర్‌ను పెంచుకునేందుకు దోహదం చేసింది. జిల్లాలో తమకు అనుకూలమైన మహబూబాబాద్, పరకాలతోపాటు వరంగల్‌పై దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సీపీఎం కొంత వెనక్కు తగ్గినప్పటికీ ప్రజా సమస్యల పోరులో ముందుంది. ఎంసీపీఐ తమ కేడర్, నాయకత్వాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది. గిరిజన ర్యాలీకి రాష్ట్ర కార్యదర్శి రాఘవులు హాజరయ్యారు.
 
 అయోమయంలో టీడీపీ


 ఈ ఏడాది ఆరంభం నుంచి టీడీపీ అనేక సమస్యలు ఎదుర్కొంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో పార్టీకి పరీక్షగా మారింది. తెలంగాణవాదుల నిరసనల భయంతో భారీ బందోబస్తు మధ్య యాత్ర సాగింది. యాత్ర జిల్లాలో పది రోజు లపాటు సాగినా పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక సహకార ఎన్నికల్లో చావు దెబ్బతింది. అనంతరం కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేత టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆపార్టీ తీవ్ర కలవరపాటుకు గురైంది. ఆత్మరక్షణలో పడింది. అనంతరం వచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పరువు దక్కించుకున్నప్పటికీ పట్టు సాధించలేకపోయింది. పార్టీని క్రమంగా వీడిపోయేవారు పెరుగుతూ వచ్చారు. ద్వితీయ శ్రేణి నుంచి ప్రధాన నేతలు కూడా ఊగిసలాటలో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. తెలంగాణ ప్రకటన తర్వాత కొంత గొంతుపెంచినప్పటికీ ఇటీవల బాబు వైఖరి ఆ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement