'బి' టెన్షన్
గంట ముందే బీ ఫారాలు
అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి
‘దూకుడు’ను అడ్డుకునేందుకే... అభ్యర్థుల్లో ఆందోళన
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు... ఇతర పార్టీల అభ్యర్థులుగా మారకూడదనే తలంపుతో వివిధ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో పాటు అధికార టీఆర్‌ఎస్‌లో సైతం ఇదే పరిస్థితి. అభ్యర్థులను ప్రకటించేందుకు తాత్సారం చేసిన పార్టీలు.. బీ ఫారాలు ఇచ్చేందుకూ వెనుకాడుతున్నాయి. అన్ని పార్టీల నుంచీ ఒకరికి మించి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. వీరిలో సొంత పార్టీ బీఫారం అందని వారంతా గోడ దూకి వేరే పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారేమోనని అగ్రనేతలు ఆలోచిస్తున్నారు. దీంతో ఇప్పుడే బీ ఫారాలు ఇచ్చేందుకు సాహసించడం లేదు. నామినేషన్లు వేసిన వారిలో కొందరు స్థానికంగా పట్టున్నవారు కావడం... ఎన్నికల్లో సొంత బలంతో గెలిచే పరిస్థితి ఉండటంతో అలాంటి వారి విషయమై పార్టీలు ఆందోళనలో ఉన్నాయి. దీంతోచివరి గంటలో మాత్రమే బీ ఫారాలు అందజేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప సంహరణకు తుది గడువైన 21వ తేదీ(గురువారం) మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు బీఫారాలు సమర్పించాల్సి ఉంది.
ఆ వ్యవధి ముగిసేందుకు గంటో... గంటన్నర ముందు మాత్రమే బీ ఫారాలు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా చేస్తేనే ‘దూకుడు’కు అడ్డుకట్ట వేయవచ్చనేది వారి యోచన. మంగళవారం నియోజకవర్గాల ఇన్‌చార్జులతో సమావేశమైన టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ నాయకులు తమ అభ్యర్థులకు బుధవారం బీ ఫారాలు ఇస్తామని చెప్పారు. అయితే గడువుకు కొద్దిసేపటి ముందు మాత్రమే ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు హైదరాబాద్ జిల్లా నాయకుడొకరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా చివరి రోజు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్దనే అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.