టీఆర్‌ఎస్ టిక్కెట్ ఎవరికో..
అధిష్టానం పరిశీలనలో రవికుమార్, దయూకర్ పేర్లు
రేసులో మరికొందరు నేతలు.. ఎవరికివారు ప్రయత్నాలు
పార్టీలో చర్చ తర్వాతే నిర్ణయం
వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి పోరు మొదలైంది.. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అంచనా వేస్తూ సత్తా ఉన్న నాయకుడి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థులు ఖరారైన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. మన జిల్లాకు చెందిన వారికే టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి నుంచీ పార్టీతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వారి పేర్లను అభ్యర్థిత్వం కోసం టీఆర్‌ఎస్ పరిశీలిస్తోంది. పార్టీ అభ్యర్థిత్వం కోసం పదుల సంఖ్యలో నేతలు పోటీపడుతున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం... టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు గుడిమల్ల రవికుమార్, పసునూరి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌లో కీలకంగా పనిచేసిన ఈ ఇద్దరిలో ఒకరిని టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గుడిమల్ల రవికుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉంటున్నారు. గతంలో ఆయన పార్టీ యువజన విభాగం జిల్లా బాధ్యతలను కూడా నిర్వర్తించారు.
అధినేత కేసీఆర్, కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసులలో వారి తరఫున రవికుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల కోటాలో తనకు పోటీ చేసే అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లోనూ పని చేసిన అనుభవాన్ని పార్టీ గుర్తిస్తుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో గతంలో కీలకంగా పనిచేసిన పసునూరి దయాకర్ పేరు కూడా టీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. పసునూరి దయాకర్ సైతం గతంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్‌ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్‌కు టీఆర్‌ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. టిక్కెట్ కేటాయింపులో ఇది తనకు ఉపయోగపడుతుందని దయాకర్ భావిస్తున్నారు.
ప్రయత్నాల్లో మరికొందరు...
అధికార పార్టీ కావడంతో గెలుపు అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది నేతలు టీఆర్‌ఎస్ టిక్కెట్‌పై గురిపెట్టారు. స్థానిక నాయకులకే టిక్కెట్ వస్తుందని ముఖ్యనేతలు చెబుతుండడంతో జిల్లాలోని ఎస్సీ వర్గం ముఖ్యనేతలు అందరూ ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న చింతల యాదగిరి, జోరిక రమేశ్, జన్ను జకార్య, బోడ డిన్న, బొజ్జపల్లి రాజయ్య టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన జన్ను పరంజ్యోతి, రామగల్ల పరమేశ్వర్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబయ్య, డాక్టర్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ రమేశ్ సైతం టీఆర్‌ఎస్ టిక్కెట్ వస్తుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధిష్టానం మాత్రం గుడిమల్ల రవికుమార్, పసునూరి దయాకర్‌లతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య భార్య ఫాతిమామేరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ భార్య కవితాకుమారి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ఈ నెల 28న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాతే టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
ఇవీ.. వీరి అనుకూలతలు
గుడిమల్ల రవికుమార్ గతంలో పార్టీ యువజన విభాగం జిల్లా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లపై నమోదైన ఉద్యమ కేసులలో వారి తరఫున రవికుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల కోటాలో తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు.
పసునూరి దయాకర్ గతంలో
వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. టిక్కెట్ కేటాయింపులో ఇది తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.