'బీజేపీ హయాంలోనే పేదలకు భరోసా'
Published Tue, Aug 16 2016 4:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
హైదరాబాద్ : ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే కాకుండా సబ్సిడీలను నేరుగా వారి ఖాతాలోకి వచ్చే విధంగా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు అన్నారు. గత పాలకుల హయాంలో సగానికి పైగా దళారీల చేతులోకి వెళ్ళేవన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి ఒక్కరూపాయి కూడా లేకుండా జనధన్ పథకం ద్వారా బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరిగిందన్నారు. తిరంగ్ యాత్రలో భాగంగా మురళీధర్‌రావు కూకట్‌పల్లి వై జంక్షన్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి అనంతరం ర్యాలీగా సమీపంలో ఉన్న ఇందిరానగర్ మురికివాడకు వెళ్ళి యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడి బస్తీ వాసుల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 85వేల ఇళ్లు కేటాయించిందనీ, రాబోయే కాలంలో మరిన్ని ఇళ్ళు కేటాయించి ప్రతి పేదవాడికి పక్కా ఇంటి కోసం కృషి చేస్తుందన్నారు. మోదీ హయాంలో అవినీతి రహిత ప్రభుత్వం నడుస్తుందని, ఇది జీర్ణించుకోలేని అవినీతి చక్రవర్తులకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయన్నారు. ప్రధాని చేపట్టబోయే పథకాలు పేదలకు నేరుగా అందే విధంగా తాము కృషి చేస్తామన్నారు.
Advertisement
Advertisement