
‘వైట్’ ఎలా..?
బ్లాక్‌మనీ మార్చుకునేందుకు ఫైనాన్సర్ల తిప్పలు
సీఏల వద్దకు పరుగులు
బంగారం, భూముల కొనుగోలుపై దృష్టి
వరంగల్ :పెద్ద నోట్ల రద్దుతో ఫైనాన్షియర్లు, వడ్డీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నారుు. ఇప్పటి వరకు వడ్డీకి తీసుకొని ఇవ్వకుండా తప్పించుకున్న వారు ఇప్పుడు అప్పులు చెల్లిస్తుండడంతో వారి దగ్గరి మరింత నగదు వచ్చి చేరుతోంది. రూ.500, రూ.వేరుు నోట్ల రద్దుతో తమ వద్ద ఉన్న పెద్దనోట్లు ఎలా మార్చుకోవాలన్న విషయంపై చర్చించుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు, రియల్టర్లకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చే ఫైనాన్సర్లు, వడ్డీ వ్యాపారులు నగరంలో చాలా మందే ఉన్నారు. వీరంతా తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లో జమ చేయరు. ఉన్న డబ్బంతా లిక్విడ్ క్యాష్‌గానే ఉంటుంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లు అడిగిందే తడువుగా వెంటనే గంటల్లో రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు డబ్బు సమకూరుస్తుంటారు.
వీరి వద్ద అప్పులు తీసుకున్న వారు ఇదే సమయంలో తిరిగి చెల్లిస్తుండడం మరింత ఇబ్బంది తెచ్చిపెడుతోంది. ‘ అన్నా.. నీవు రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చావు.. నేను అవే ఇస్తున్నాను. డబ్బు ఉన్నప్పుడు తీసుకో.. లేకుంటే మళ్లీ ఇచ్చే ప్రసక్తే లేదు’ అని బకారుుదారులు ఖరాకండిగా చెబుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫైనాన్షియర్లు నగుదు తీసుకుంటున్నారు.
లాకర్లలో డబ్బు ఏం చేయాలి...
వైద్య, స్థిరాస్తి రంగంలో ఉన్న కొంత మంది తమ వద్ద ఉన్న (ట్యాక్స్ కట్టని) డబ్బును వారి పేర ఉన్న బ్యాంకు లాకర్టలో పెట్టుకుంటారని, ఎప్పుడైనా వెంటనే భూమి లాంటివి కొనుగోలు చేయడానికి ఈ డబ్బును వినియోగిస్తారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఉన్న డబ్బును ఏం చేయాలో తెలియని సంకట స్థితిలో పడ్డట్లు తెలుస్తోంది. మార్కెట్ కంటే ఎక్కువ ధర పెట్టి భూములు కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విక్రరుుంచే వారు ముందుకురావడం లేదని తెలిసింది.
బంగారానికి రెక్కలు...
పెద్ద నోట్ల మార్పిడిలో పన్ను కట్టని డబ్బుల వల్ల ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్న పలువురు.. ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. బంగారం అమ్మకందారులు పాన్‌కార్డులుంటేనే విక్రయాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా, నగరంలో అది అమలు కావడం లేదు. ముఖ్యంగా రెడిమేడ్ బంగారు నగల విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధర 10గ్రాములకు రూ.31వేలకు పైగా ఉన్నా.... మరో ఐదు వేల వరకు ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
సీఏల వద్దకు పరుగులు...
ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను డిసెంబర్ 31వ తేది వరకు బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సరిగా ట్యాక్స్‌లు కట్టకుండా డబ్బు నిల్వ ఉంచుకున్న వాణిజ్య, వ్యాపార వర్గాల వారు చార్టెడ్ అకౌంటెంట్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటి వరకు తమ వ్యాపారం ద్వారా లాభం వచ్చిన విధంగా లెక్కలు ప్రభుత్వానికి చెప్పవచ్చా...అందువల్ల ఎంత వరకు లాభం అన్న విషయాలు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఐటీ రిటర్న్ దాఖలు చే స్తేనే భవిష్యత్తులు అర్థిక పరమైన ఇబ్బందులు ఉండవని సీఏలు సలహాలు ఇస్తున్నట్లు తెలిసింది.