బోధన.. వేదన
బోధన.. వేదన
Published Mon, Feb 13 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
ఏలూరు సిటీ : ప్రభుత్వ బడులను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఫలితంగా విద్యాబోధన కుంటుబడుతోంది. విద్యార్థులు లేరనే సాకుతో ఇప్పటికే పలు పాఠశాలలు మూసివేసినా.. టీచర్ల కొరత తీరలేదు. దీంతో బడుల్లో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన వివిధ సర్వేల్లోనూ ఈ విషయం బహిర్గతమైంది. అయినా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సర్కారు చొరవ చూపడం లేదు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక
పాఠశాలల్లోనూ టీచర్ల కొరత తీవ్రంగా ఉంది.
532 పోస్టులు ఖాళీ
జిల్లా వ్యాప్తంగా 532 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో 123 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మైదాన ప్రాంతంలో 122, ఏజెన్సీలో ఒకటి ఉన్నాయి. భాషాపండిట్ పోస్టులు 68 ఖాళీగా ఉన్నాయి. వాటిలో 67 మైదాన ప్రాంతంలో, ఒకటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 341 ఖాళీగా ఉంటే వాటిలో మైదాన ప్రాంతంలో 305 పోస్టులు, ఏజెన్సీ ప్రాంతంలో 36 పోస్టులు ఉన్నాయి.
ఇదో వింత!
కొన్ని బడుల్లో వింత పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల విద్యార్థులకు తగ్గట్టు ఉపాధ్యాయులు లేరు. ఇంకొన్నిచోట్ల పిల్లలు లేకున్నా ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు విద్యాశాఖ అధికారులు సర్దుబాటు చేసినా ఖాళీల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఉపాధ్యాయుల కొరత వల్ల ఉన్నవారిపై పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హెచ్‌ఎం పోస్టులూ ఖాళీ ..ఇటీవలే అడ్‌హక్ విధానంలో మండల విద్యాశాఖ అధికారి పోస్టులను భర్తీ చేయటంతో హెచ్‌ఎంలు ఎంఈవోలుగా వెళ్లారు. దీంతో 45మంది ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లేకపోవటంతో విద్యాబోధన, పర్యవేక్షణ కుంటుపడే ఆస్కారం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో 45 ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లేకపోతే ఎలాగనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వెంటనే హెచ్‌ఎంల నియామకానికి చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. పదోన్నతితో భర్తీ చేయాలి ..ఖాళీ అయిన ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదోన్నతితో భర్తీ చేయాలి. హెచ్‌ఎంలు లేకపోతే బడులపై పర్యవేక్షణ ఉండదు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇది సరికాదు. ఇతర పోస్టుల భర్తీకీ చర్యలు తీసుకోవాలి.
– షేక్‌సాబ్జి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి :
టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉన్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం నియామకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక పిల్లల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. విద్యాశాఖ అధికారులు దీనిపై చర్యలు చేపట్టాలి. – గగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్1938, జిల్లా ప్రధాన కార్యదర్శి
Advertisement
Advertisement