బొగ్గు భాగ్యాలు
బొగ్గు భాగ్యాలు
Published Mon, Dec 5 2016 2:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్‌ఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్‌ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్‌ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు.
2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు
మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
2013లోనే నిర్ధారణ
లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది.
6 నెలలపాటు అన్వేషణ
అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్‌వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ
Advertisement
Advertisement