బోనాల పండుగ సందర్భంగా భక్తుల సదుపాయార్ధం ఆలయాల వద్ద పనుల కోసం కేటాయించిన నిధులను బొక్కేశారు.
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో మళ్లీ అదే తంతు.. బోనాల పండుగ సందర్భంగా భక్తుల సదుపాయార్ధం ఆలయాల వద్ద పనుల కోసం కేటాయించిన నిధులను బొక్కేశారు. ఆలయాల వద్ద పనులూ కనపడలేదు.. విడుదలైన నిధులకు లెక్కలూ లేవు. ఖర్చు చేసినవాటికి పద్దూ లేదు. పైగా ఈ సంవత్సరం బోనాల పేరిట ప్రారంభించామని పేర్కొన్న పనులు.. వచ్చే ఏడాది బోనాల వరకు ‘పురోగతి’లో ఉన్నట్లు పేర్కొనడం.. ఆ తర్వాత కొత్త నిధులు మంజూరు కావడం పరిపాటిగా మారింది. దాంతో పాత నిధుల్ని అడిగే వారుండరు. పనులు చేయకపోయినప్పటికీ ఆ నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
రూ.12 కోట్లకు లెక్క లేదు..
బోనాల పేరిట ప్రతియేటా కోట్ల రూపాయలు మంజూరవుతున్నా ఏనాడూ పనులు చేసిన పాపాన పోలేదు. చేసిన కొద్దిపాటి పనుల్లోనూ నాణ్యత తీసిట్టుగా మారింది. యేటా బోనాల సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రహదారుల మరమ్మతులు, ఆలయాలకు సున్నాలు, షాబాద్ ఫ్లోరింగ్, విద్యుత్ దీపాల వంటి పనులు చేయడం పరిపాటి. ఇందుకు కోసం ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ రూ.12 కోట్లు మంజూరు చేసింది.
పండగ నాటికే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, పండుగ ముగిసి నెల దాటినా ఇంకా చేస్తునే ఉన్నారు. పూర్తయినట్లు చెబుతున్న పనుల్లో నిజంగా ఎన్ని చేశారో అధికారులు, కాంట్రాక్టర్లకే తెలియాలి. పూర్తయిన పనులు ఎక్కడ చేశారో వివరాలు వెల్లడించేందుకు మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. దీంతో అసలు పనులు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చేయాల్సింది ఒక చోట.. చేసేది మరో చోట..
బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద.. ఆలయాలకు దారితీసే మార్గాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిధులతో పనులు చేయాల్సి ఉంది. కానీ ఎక్కడ పడితే అక్కడ పనులు చేస్తున్నట్లు చూపుతున్నారు. దీంట్లో నిజంగా పనులు చేస్తున్నారో, లేక కేవలం కాగితాల్లో చూపుతున్నారో అంతుపట్టని పరిస్థితి.