శేసిలేటివాగులో బాలుడి గల్లంతు
శేసిలేటివాగులో బాలుడి గల్లంతు
Published Sat, Sep 24 2016 12:13 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
గానుగుపల్లి(నాంపల్లి)
వాగులోపడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన నాంపల్లి మండలం గానుగుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మానాల నర్సింహ, కవిత దంపతుల కుమారుడు సాయికుమార్(14) చండూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. భారీ వర్షాల కారణంగా పాఠశాలకు సెలవు ఇవ్వడంతో శుక్రవారం ఉదయం తన ఇద్దరు స్నేహితులతో కలిసి సైకిల్‌పై గ్రామ శివారులో ప్రవహిస్తున్న శేషిలేటి వాగుల వద్దకు వెళ్లాడు. మూడు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలకు శేషిలేటి వాగు రోడ్డుపై ప్రవహిస్తోంది. స్నేహితులతో కలిసి రోడ్డుగుండా వాగు అవతలివైపు వెళ్లిన సాయికుమార్ కాసేపటికి ఒక్కడే సైకిల్‌పై తిరుగుపయనమయ్యాడు. అయితే ఈ క్రమంలో రోడ్డుపై వరద ఉధృతి పెరగడంతో సైకిల్ అదుపుతప్పి అందులో కొట్టుకుపోయాడు. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్లిన కొండల్ అనే రైతు గమనించి బాలుడిని కాపాడేందుకు తానుకూడా వరదలోకి దూకాడు. ఈ క్రమంలో సాయికుమార్ అతడిని గట్టిగా పట్టుకోవడంతో కొండల్ విధిలించుకున్నాడు. అనంతరం తన వద్ద తువాల సహాయంతో బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో సాయికుమార్ గల్లంతయ్యాడు. కుమారుడి స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రి రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకుని ఘటన స్థలాన్ని దేవరకొండ ఆర్డీఓ గాంగధర్, డీఎస్పీ చంద్రమోహన్, సీఐ బాలగాంగిరెడ్డి, నాంపల్లి, మర్రిగూడ,చండూరు, గుర్రంపూడ్ ఎస్సైలు , ప్రకాశ్‌రావు, శంకర్‌రెడ్డి, తహసీల్దా యండి.ఖలీల్‌అహ్మద్, ఎంపీడీఓ, టి మనుమంత్‌ప్రసాద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మత్స్యకారుల సహాయంతో సాయంత్రం వరకు గాలించినా బాలుడి ఆచూకీ కోసం లభించలేదు.
Advertisement