కుమారుడు దినేష్‌తో తల్లిదండ్రులు దుర్గారావు,రాధ
కూలి చేసుకుని బతికే ఆ కుటుంబం ఇప్పుడు కష్టాల్లో పడింది. ఏడేళ్ల బాలుడిని బతికించుకోవడానికి నరకయాతన పడుతోంది. చేతిలో ఉన్న డబ్బులు చాలక, చికిత్స చేయించేందుకు స్థోమత లేక నిత్యం నరకం చూస్తోంది. బోన్‌మేరోతో బాధ పడుతున్న కుమారుడిని బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. చికిత్సకు మరికొద్ది రోజులే గడువు ఉండడంతో కొడుకు ప్రాణాలు కాపాడడానికి ఆ దంపతులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల దీపాన్ని కాపాడుకోవడానికి సాయం కోరుతున్నారు. చికిత్స చేయించడం తలకు మించిన భారం కావడంతో చేయూత కోరుతున్నారు.
మండలంలోని తెట్టంగి గ్రామానికి చెందిన వలస కూలీలు ముంజి దుర్గారావు, రాధ దంపతుల ఏడేళ్ల కుమారుడు దినేష్ బోన్‌మేరో వ్యాధితో బాధ పడుతున్నాడు. కొద్ది రోజుల్లో చికిత్స చేయించకపోతే బాలుడు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. కుమారుడిని ఎలా కాపాడుకోవాలో తెలీక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరి బాధను చూడలేక గ్రామానికి చెందిన 10 మంది యువకులు చందాలు సేకరించేందుకు నడుం బిగించారు. ఇప్పటికే తెట్టంగి, పాలకొండ పరిసర విద్యాసంస్థల్లో వారికి తెలిసిన వారి నుంచి రూ.70 వేల వరకు వసూలు చేసి ఇచ్చారు. కానీ ఆపరేషన్ చేయాలంటే ఇంకా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు.