bone marrow Transplant
-
మణిపాల్‌లో ఆరోగ్యశ్రీ కింద బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్
తాడేపల్లిరూరల్: మణిపాల్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ కింద బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను చేస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కంటిపూడి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణిపాల్‌లో ఇప్పటివరకు 50 బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. క్లిష్టతరమైన, ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం అభినందించదగ్గ విషయం అన్నారు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ తరహా క్లిష్టమైన చికిత్సల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా మణిపాల్‌లో అద్భుతమైన చికిత్స లభిస్తోందని తెలిపారు. అంకాలజిస్ట్ డాక్టర్ మాధవ్ దంతాల మాట్లాడుతూ.. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రెండు రకాలని, వాటిలో ఒకటి ఆటోలోగస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని, రెండవది అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.శ్రావణ్‌కుమార్, డాక్టర్ సీహెచ్ మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మృత్యుకోరల్లో బాలుడు
బోన్‌మేరో వ్యాధితో బాధ పడుతున్న ఏడేళ్ల బాలుడు చికిత్స చేయించకపోతే ప్రాణాలకే ముప్పు అంటున్న వైద్యులు సాయం కోసం తల్లిదండ్రుల అభ్యర్థన కూలి చేసుకుని బతికే ఆ కుటుంబం ఇప్పుడు కష్టాల్లో పడింది. ఏడేళ్ల బాలుడిని బతికించుకోవడానికి నరకయాతన పడుతోంది. చేతిలో ఉన్న డబ్బులు చాలక, చికిత్స చేయించేందుకు స్థోమత లేక నిత్యం నరకం చూస్తోంది. బోన్‌మేరోతో బాధ పడుతున్న కుమారుడిని బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. చికిత్సకు మరికొద్ది రోజులే గడువు ఉండడంతో కొడుకు ప్రాణాలు కాపాడడానికి ఆ దంపతులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల దీపాన్ని కాపాడుకోవడానికి సాయం కోరుతున్నారు. చికిత్స చేయించడం తలకు మించిన భారం కావడంతో చేయూత కోరుతున్నారు. – తెట్టంగి (వీరఘట్టం) మండలంలోని తెట్టంగి గ్రామానికి చెందిన వలస కూలీలు ముంజి దుర్గారావు, రాధ దంపతుల ఏడేళ్ల కుమారుడు దినేష్ బోన్‌మేరో వ్యాధితో బాధ పడుతున్నాడు. కొద్ది రోజుల్లో చికిత్స చేయించకపోతే బాలుడు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. కుమారుడిని ఎలా కాపాడుకోవాలో తెలీక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరి బాధను చూడలేక గ్రామానికి చెందిన 10 మంది యువకులు చందాలు సేకరించేందుకు నడుం బిగించారు. ఇప్పటికే తెట్టంగి, పాలకొండ పరిసర విద్యాసంస్థల్లో వారికి తెలిసిన వారి నుంచి రూ.70 వేల వరకు వసూలు చేసి ఇచ్చారు. కానీ ఆపరేషన్ చేయాలంటే ఇంకా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు కూలి పనులకు వలస వెళ్లిపోవడంతో దినేష్ తాత ఇంటి వద్దే ఉంటున్నాడు. గత నెలలో చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చింది. అది కాస్తా బోన్‌మేరో అని తెలియడంతో తల్లిదండ్రులు బిక్కచచ్చిపోయారు. బాలుడిని పరీక్షించిన శ్రీకాకుళంలోని వైద్యులు తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడకు వెళ్లాకే వ్యాధి బయటపడింది. ఆపరేషన్ చేస్తే బాలుడు బతుకుతాడని, ఆపరేషన్‌కు రూ.14 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అయితే తమకు అంత స్థోమత లేదని ఆ దంపతులు చెప్పడంతో శస్త్రచికిత్సకు కావాల్సిన సగం మొత్తాన్ని ఆస్పత్రి గ్రాంటు నుంచి వచ్చేలా తాము సాయపడతామని మిగిలిన మొత్తాన్ని సర్దుబాటు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు ఆ రిపోర్టులు పట్టుకుని సాయం కోసం వేడుకుంటున్నారు. ఎవరైనా సాయం చేయకపోతారని అని ఆశగా ఎదురుచూస్తున్నారు. స్థానికులు స్పందించి వీరికి సాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వీరి గురించి ప్రచారం చేస్తున్నారు. సాయం చేయాలనుకునే వారు 9701882418, 9912254195 నంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు. -
ఈ బాలుడికి ఎవరు ప్రాణం పోస్తారు?
మదురై: ఆ కుర్రాడికి ఇంజినీర్ కావాలని కల. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు అనే తీరుగా పుట్టుకతోనే మదురైకి చెందిన చంద్రప్రకాశ్ అనే 14 ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. దీంతో అతడికి స్కూల్ వాతావరణం కన్నా ఆస్పత్రితోనే పరిచయం ఎక్కువైంది. స్కూల్లో కంటే ఆస్పత్రి పేషెంట్ రూమ్‌లోనే ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్లుగా అతడి పరిస్థితి మరింత దిగజారింది. అయితే వైద్యులు ఆ బాలుడు బతుకుతాడని హామీ ఇచ్చారు. బోన్ మ్యారో సహాయం చేసే వాళ్లు ఉంటే అతడిని దక్కించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం మెడికల్ సపోర్ట్ తో కాలం వెల్లదీస్తున్న ఆ కుర్రాడికి బోన్ మ్యారో సహాయం దానం చేసేందుకు ఒక వ్యక్తి వచ్చాడు కానీ.. అంతమొత్తానికి అయ్యే ఖర్చు భారాన్ని తల్లిదండ్రులు భరించలేని పరిస్థితి. దీంతో ఎవరైనా పెద్ద మనసుతో సహాయం చేస్తే తమ బిడ్డ బతుకుతాడని మొరపెట్టుకుంటున్నారు. తమిళనాడులోని థెని జిల్లాకు చెందిన ఈ బాలుడి తండ్రి ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. తల్లి ఇంట్లోనే ఉంటుంది. ఇప్పటికే ఆ బాలుడిని బతికించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆస్తినంతా అమ్మేసుకున్నారు. -
బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో ఫలితం ఎలా ఉంటుంది?
క్యాన్సర్ కౌన్సెలింగ్ మా అబ్బాయికి మూడున్నరేళ్లు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే హైదరాబాద్‌కు వచ్చి చూపించాం. అన్ని పరీక్షలు చేశాక, బ్లడ్‌క్యాన్సర్ అని చెప్పారు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా దీనికి పూర్తిగా చికిత్స చేయవచ్చని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. మా బాబు ఆరోగ్యంపై మా కుటుంబ సభ్యులమంతా కలత చెందుతున్నాం. పై ప్రక్రియ ఎలా చేస్తారు. మాకు తగిన సలహా ఇవ్వండి. - మల్లికార్జున్, ఆదిలాబాద్ అనేక రకాల బ్లడ్క్యాన్సర్లకు బోన్‌మ్యారో (ఎముకలోని మజ్జ లేదా మూలగ) ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే ఇప్పటికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్స. క్యాన్సర్గ్రస్తమైన బోన్‌మ్యారోను తొలగించి, దాని స్థానంలో ఆరోగ్యవంతమైన బోన్‌మ్యారోను నింపడం ద్వారా బ్లడ్‌క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆరోగ్యవంతమైన బోన్‌మ్యారోను హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ అయిన పేషెంట్ కుటుంబ సభ్యులు లేదా ఇతర దాతల నుంచి సేకరించి, ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. అధునాతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఇప్పుడు చాలా సురక్షితమైన ప్రక్రియ అయ్యింది. అయితే ఇందుకు అనువైన అన్ని సౌకర్యాలు కలిగిన సెంటర్, అనుభవజ్ఞులైన ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. సాధారణంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ 75 ఏళ్ల వారికి కూడా చేస్తారు. అయితే వయసు ఎంత తక్కువగా ఉంటే ఈ ప్రక్రియ ఫలితాలు అంతబాగా ఉంటాయి. మీ అబ్బాయి వయసులో చాలా చిన్నవాడు అయినందున బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబటి మీ బాబును సమీపంలోని అనుభవజ్ఞులైన ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్లు అందుబాటులో ఉన్న బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌కు తీసుకెళ్లండి. అలాగే బోన్‌మ్యారోను దానం చేయగలవారి కోసం కుటుంబ సభ్యుల హెచ్ఎల్ఏ టైపింగ్ నిర్ధారణ కోసం అందుబాటులో ఉంచండి. బ్లడ్ క్యాన్సర్లలో మూడు రకాలు ఉంటాయి. అవి... లింఫోమా, మైలోమా, లుకేమియా. మొదటి రెండు రకాల క్యాన్సర్ల చికిత్స కోసం పేషెంట్ నుంచే స్టెమ్‌సెల్స్ సేకరించడం జరుగుతుంది. లుకేమియా విషయంలో మాత్రం హెచ్ఎల్ఏ మ్యాచ్ అయిన దాత నుంచి స్టెమ్‌సెల్స్ సేకరించి, పేషెంట్ ఎముక మజ్జ మార్పిడి చేయడం ద్వారా చికిత్స చేస్తారు. మీ అబ్బాయి విషయంలో అసలు బాధపడటానికి అవకాశమే లేదు. దాదాపు 90 శాతం మంది పేషెంట్లు ఈ చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. డాక్టర్ గణేశ్ జెషైట్వార్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్‌మ్యారో టాన్స్ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్