బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో ఫలితం ఎలా ఉంటుంది? | Cancer Counseling | Sakshi
Sakshi News home page

బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో ఫలితం ఎలా ఉంటుంది?

Published Mon, Jul 20 2015 12:54 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Cancer Counseling

క్యాన్సర్ కౌన్సెలింగ్
మా అబ్బాయికి మూడున్నరేళ్లు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే హైదరాబాద్‌కు వచ్చి చూపించాం. అన్ని పరీక్షలు చేశాక, బ్లడ్‌క్యాన్సర్ అని చెప్పారు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా దీనికి పూర్తిగా చికిత్స చేయవచ్చని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. మా బాబు ఆరోగ్యంపై మా కుటుంబ సభ్యులమంతా కలత చెందుతున్నాం. పై ప్రక్రియ ఎలా చేస్తారు. మాకు తగిన సలహా ఇవ్వండి.
- మల్లికార్జున్, ఆదిలాబాద్

 
అనేక రకాల బ్లడ్‌క్యాన్సర్లకు బోన్‌మ్యారో (ఎముకలోని మజ్జ లేదా మూలగ) ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే ఇప్పటికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్స. క్యాన్సర్‌గ్రస్తమైన బోన్‌మ్యారోను తొలగించి, దాని స్థానంలో ఆరోగ్యవంతమైన బోన్‌మ్యారోను నింపడం ద్వారా బ్లడ్‌క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆరోగ్యవంతమైన బోన్‌మ్యారోను హెచ్‌ఎల్‌ఏ జీన్ మ్యాచ్ అయిన పేషెంట్ కుటుంబ సభ్యులు లేదా ఇతర దాతల నుంచి సేకరించి, ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. అధునాతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఇప్పుడు చాలా సురక్షితమైన ప్రక్రియ అయ్యింది. అయితే ఇందుకు అనువైన అన్ని సౌకర్యాలు కలిగిన సెంటర్, అనుభవజ్ఞులైన ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి.

సాధారణంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ 75 ఏళ్ల వారికి కూడా చేస్తారు. అయితే వయసు ఎంత తక్కువగా ఉంటే ఈ ప్రక్రియ ఫలితాలు అంతబాగా ఉంటాయి. మీ అబ్బాయి వయసులో చాలా చిన్నవాడు అయినందున బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబటి మీ బాబును సమీపంలోని అనుభవజ్ఞులైన ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్లు అందుబాటులో ఉన్న బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌కు తీసుకెళ్లండి. అలాగే బోన్‌మ్యారోను దానం చేయగలవారి కోసం కుటుంబ సభ్యుల హెచ్‌ఎల్‌ఏ టైపింగ్ నిర్ధారణ కోసం అందుబాటులో ఉంచండి. బ్లడ్ క్యాన్సర్లలో మూడు రకాలు ఉంటాయి. అవి... లింఫోమా, మైలోమా, లుకేమియా. మొదటి రెండు రకాల క్యాన్సర్‌ల చికిత్స కోసం పేషెంట్ నుంచే స్టెమ్‌సెల్స్ సేకరించడం జరుగుతుంది. లుకేమియా విషయంలో మాత్రం హెచ్‌ఎల్‌ఏ మ్యాచ్ అయిన దాత నుంచి స్టెమ్‌సెల్స్ సేకరించి, పేషెంట్ ఎముక మజ్జ మార్పిడి చేయడం ద్వారా చికిత్స చేస్తారు. మీ అబ్బాయి విషయంలో అసలు బాధపడటానికి అవకాశమే లేదు. దాదాపు 90 శాతం మంది పేషెంట్లు ఈ చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
 
డాక్టర్ గణేశ్ జెషైట్వార్
హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్‌మ్యారో టాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement