బోన్‌ మ్యారో మార్పిడి చికిత్స అంటే ఏమిటి?  | What Is Bone Marrow Conversion Treatment? | Sakshi
Sakshi News home page

బోన్‌ మ్యారో మార్పిడి చికిత్స అంటే ఏమిటి? 

Published Wed, Nov 21 2018 12:58 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

What Is Bone Marrow Conversion Treatment? - Sakshi

బ్లడ్‌ కేన్సర్‌ కౌన్సెలింగ్‌
మా పాప వయసు ఏడేళ్లు. తరచూ జ్వరంతో బాధపడుతోంది. మాటిమాటికీ జ్వరం వస్తోంది. ఎప్పుడూ నీరసంగా ఉంటూ చదువులో బాగా వెనకబడిపోతోంది. దగ్గర్లో చాలామంది డాక్టర్లకు చూపించాం. ఈమధ్య టౌన్‌లో డాక్టరుకు చూపిస్తే రక్తంలో క్యాన్సర్‌ ఉన్నట్లు చెప్పారు. భయం లేదంటూనే దీనికి శాశ్వత చికిత్సగా బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించమని చెప్పారు. ఈ చికిత్స ఏమిటి? హైదరాబాద్‌లో అందుబాటులో ఉందా? మాకు ఆందోళనగా ఉంది. దయచేసి వివరంగా చెప్పండి. – ఎం. రామ్మోహన్, పాలమూరు 
బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అన్నది బ్లడ్‌క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు కొత్తజీవితాన్ని ఇవ్వగల అత్యాధునిక వైద్య చికిత్స. ప్రస్తుతం ఇది మన హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ చికిత్సతో బ్లడ్‌క్యాన్సర్‌నుంచి శాశ్వత విముక్తి సాధ్యమవుతుంది.  మన శరీరంలో తొడ, తుంటి వంటి పొడవైన ఎముకలలో ఉండే కొవ్వుతో కూడిన మెత్తటి స్పాంజి లాంటి పదార్థం ఉంటుంది. దీన్ని ఎముక మజ్జ (బోన్‌మ్యారో) అంటారు. దీనిలో పరిపక్వానికి రాని స్టెమ్‌సెల్స్‌ అనే మూలకణాలు ఉంటాయి. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల్లో ఈ బోన్‌మ్యారో దెబ్బతిని ఉంటుంది. అలాంటి లోపభూయిష్టమైన బోన్‌మ్యారోను తొలగించి, దాని స్థానంలో ఆరోగ్యకరమైన స్టెమ్‌సెల్స్‌ ప్రవేశపెట్టడమే బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స. ఈ కణాలు ఎముకలోని బోన్‌మ్యారోలో స్థిరపడి ఆరోగ్యకరమైన రక్తకణాలను ఉత్పత్తి చేయడంతో పాటు, మంచి బోన్‌మ్యారోను అభివృద్ధి చేస్తాయి. ఈ వైద్యప్రక్రియకు కావాల్సిన ఆరోగ్యకరమైన మూలకణాలు దాత నుంచి సేకరిస్తారు. ఇందులో దాత స్టెమ్‌సెల్స్‌ స్వీకరించే వ్యక్తికి జన్యురీత్యా సంబంధికులై ఉండాలి. చాలా సందర్భాల్లో దగ్గరి బంధువులు దాతలవుతారు. కానీ జన్యురీత్యా సరిపడే బయటి వ్యక్తులు కూడా దాతలుగా ఉపయోగపడతారు.
 
బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియ దాదాపుగా రక్తం ఎక్కించడంలాగానే ఉంటుంది. దాత నుంచి సేకరించిన స్టెమ్‌సెల్స్‌ను అభివృద్ధి చేసి మార్పిడికి ఒకటి రెండు రోజుల ముందే సిద్ధంగా ఉంచుకుంటారు. ఆరోగ్యకరమైన, కొత్త మూలకణాలను రోగిలోకి  ప్రవేశపెడతారు. మూలకణ మార్పిడి కొద్దిరోజుల పాటు సాగే ప్రక్రియ కావడం వల్ల చికిత్స పొందుతున్న వ్యక్తిని వారం రోజుల పాటు ఆసుపత్రిలోనో లేదా ఆసుపత్రికి అందుబాటులోనో ఉంచాల్సి వస్తుంది. మూలకణాలు (స్టెమ్‌సెల్స్‌)ను శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు ఇమ్యూనో సప్రెసెంట్‌ మందులను ఇవ్వాల్సి ఉంటుంది.  బోన్‌మ్యారో మార్పిడి ప్రక్రియకు సాధారణంగా ఉన్నతస్థాయి వైద్యకేంద్రాలలో నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే... అవసరమైన వైద్యపరీక్షలతో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ (ఆ మాటకొస్తే ఆ తర్వాత కూడా) రోగిని అత్యంత సురక్షితమైన వాతావరణంలో ఉంచి కోలుకునేట్లు చేయాల్సి ఉంటుంది. అందుకే ఉన్నతశ్రేణి వసతులు ఉన్న ఆసుపత్రిని ఎంచుకోవడం అవసరం. అయితే ఇప్పుడు ఆ స్థాయి వైద్యసౌకర్యాలు హైదరాబాద్‌లోనూ ఉన్నందువల్ల మునపటిలా దూరదూరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.  

రక్తం  గ్రూపు వేరైనా మూలకణ మార్పిడి సాధ్యం అవుతుందా?  
మా నాన్నగారి వయసు 49 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. ఎప్పుడూ నీరసంగా చాలా బలషీమనంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో చూపిస్తే బ్లడ్‌క్యాన్సర్‌ ఉన్నట్లు చెప్పారు. దీనికి పర్మనెంట్‌ చికిత్సగా బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవాల్సిందిగా చెప్పారు. పూర్తిగా మ్యాచింగ్‌ బోన్‌మ్యారో డోనార్‌ను ఏర్పాటు చేసుకోమన్నారు. ఈ మ్యాచింగ్‌ డోనార్‌ గురించి వివరించగలరు.అలాంటి దాత దొరకకపోతే ఏం చేయాలి. మ్యాచింగ్‌ కుదరలేదనుకోండి. అప్పుడు బోన్‌మ్యారో సాధ్యమవుతుందా? దయచేసి వివరంగా చెప్పండి. 
– ఆర్‌. సూర్యనారాయణమూర్తి, ఆదిలాబాద్‌ 

మార్పిడి చేసే మూలకణాల వనరును బట్టి ఈ బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మూడు రకాలు ఉన్నాయి. రెస్క్యూ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఒక వ్యక్తికి తన సొంత స్టెమ్‌సెల్స్‌తో చికిత్స చేస్తారు. ఇందుకోసం ముందుగానే ఆ వ్యక్తి ఎముకల నుంచి మూలకణాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిని బయట అభివృద్ధిపరచి మార్పిడికి సిద్ధం చేస్తారు. రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు పూర్తయ్యాక వాటితోనే ఆ వ్యక్తి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మూలకణాలే తిరిగి అతడిని చేరతాయి. ఇలా జరిగినప్పుడు మూలకణాల మార్పిడి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ఆల్లోజెనిక్‌ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఇందులో మరో వ్యక్తి నుంచి సేకరించిన మూలకణాలతో మార్పిడి ప్రక్రియను నిర్వహిస్తారు. అబ్లికల్‌ కార్డ్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కూడా దాతపైన ఆధారపడే అల్లోజెనిక్‌ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ లాంటిదే. అయితే దీనిలో నవజాత శిశువు బొడ్డుతాడు (అంబ్లికల్‌ కార్డ్‌) నుంచి సేకరించిన మూలకణాలను వాడతారు. 

బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మరో వ్యక్తి నుంచి సేకరించిన మూలకణాలతో మార్పిడి ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు మ్యాచింగ్‌ అవసరమవుతుంది. ఇందులో దాత మూలకరణాలు స్వీకరించే వ్యక్తికి జన్యురీత్యా సంబంధికులై ఉంటాడు. చాలా సందర్భాల్లో దగ్గరి బంధువులు దాతలవుతారు. అదే సమయంలో జన్యురీత్యా సరిపడే బయటి వ్యక్తులు కూడా ఉపయోగపడతారు. దాత–స్వీకర్త రక్తం గ్రూప్‌ సరిపడినవైతేనే మూలకణమార్పిడి చేస్తున్నారు. అందువల్ల మీకు పూర్తి మ్యాచింగ్‌ బోన్‌ మ్యారో దాత కోసం సూచించారు. అయితే మూలకణ మార్పిడి ప్రక్రియలో ఇటీవల నూతన విధానాలు, మెళకువలు అభివృద్ధి చెందాయి. వీటిని అనుసరించడం ద్వారా ఈ ‘పూర్తి మ్యాచింగ్‌’ పరిమితిని అధిగమించగలుగుతున్నాం. రక్తం గ్రూపు సరిపోని పక్షంలో బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ సాధ్యం కాదన్నది అపోహ మాత్రమే. బ్లడ్‌గ్రూప్‌ మ్యాచ్‌ కాకపోయినా మూలకణ మార్పిడి చేయవచ్చు. ఇందుకు దాత – స్వీకర్తల ఆర్‌.హెచ్‌. సరిపోవడం కూడా తప్పనిసరేమీ కాదు. కావాల్సిందల్లా హెచ్‌ఎల్‌ఏ జన్యువులు సరిపోవడం. హెచ్‌ఎల్‌ఏ జన్యువుల్లో క్లాస్‌–1, క్లాస్‌–2 అని రెండు రకాల ఉండాలియ. క్లాస్‌–1లో ఏ, బి, సి జతల జన్యువులు ఉంటాయి. అదే క్లాస్‌–2లో డీఆర్‌ అనే జన్యువు జత ఉంటుంది. ఈ మొత్తం నాలుగింటిలో దాత–స్వీకర్తల మధ్య రెండు జతలు సరిపోయినా (హాఫ్‌ మ్యాచ్‌) అయినా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను నిరభ్యంతరంగా చేయవచ్చు. ఈ రకమైన మూలకణ మార్పిడి ప్రక్రియలు ఫుల్‌మ్యాచ్‌ ప్రక్రియలతో సమానంగా విజయవంతం అవుతున్నాయి. అందువల్ల మీరు ఎలాంటి సందేహాలు, ఆందోళన లేకుండా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌కు వెళ్లండి.  
డాక్టర్‌ గణేష్‌ జైషెట్వార్‌
సీనియర్‌ హెమటో ఆంకాలజిస్ట్‌ అండ్‌ బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ నిపుణులు, యశోద హాస్పిటల్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement