డ్రైవింగ్ లైసెన్సులకు బ్రేకులు
డ్రైవింగ్ లైసెన్సులకు బ్రేకులు
Published Wed, Aug 31 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
తణుకు: వాహనంతో రోడ్డుపై అడుగుపెడితే అడుగడుగునా పోలీసులు, రవాణాశాఖ అధికారుల దాడులు.. డ్రైవింగ్ లైసెన్సుతోపాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకపోతే భారీ జరిమానాలు.. కొద్దికాలంగా జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. దీంతో వాహనచోదకులు వేలాదిగా డ్రై వింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అర్హతలు ఉండి, పరీక్షలన్నీ పూర్తిచేసినా శాశ్వత లైసెన్సులు జారీ జాప్యం అవుతుండటంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
ఎల్‌ఎల్‌ఆర్ వచ్చిన 30 రోజుల తర్వాత శాశ్వత లైసెన్సు కోసం అన్ని పరీక్షలు పూర్తయితే అదే రోజున డ్రై వింగ్ లైసెన్సు జారీ చేస్తుంటారు. అయితే మూడు నెలలుగా జిల్లాలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం డ్రై వింగ్ లైసెన్సులే కాకుండా వాహన రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌ఫర్ చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్డులు, లైసెన్సు రెన్యువల్ కార్డులు ఇలా వేల సంఖ్యలో కార్డులు నిలిచిపోవడంతో అటు అధికారులు ఇటు వాహనచోదకులు తలలు పట్టుకుంటున్నారు.
రోజుకు వెయ్యి కార్డులు అవసరం
జిల్లాలోని ప్రధానంగా ఏలూరులో ఉపరవాణా కార్యాలయంతో పాటు భీమవరం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం, తణుకు, పాలకొల్లు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం యూనిట్ కార్యాలయాల్లో నిత్యం డ్రై వింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఆర్సీలు, లైసెన్సు రెన్యూవల్, ఫిట్‌నెస్ వంటి సేవలు అందుతుంటాయి. ఈ సేవలన్నీ వాహనదారులకు చేరడానికి కార్డులపై ముద్రించి అందజేయాల్సి ఉంటుంది. మూడు నెలలుగా ఖాళీ కార్డుల సరఫరా లేకపోవడంతో కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సాధారణంగా నిత్యం జిల్లాలోని అన్ని కార్యాలయాల పరిధిలో సుమారు వెయ్యి కార్డుల వరకు అవసరం అవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు సుమారు 60 నుంచి 70 వేల వరకు డ్రై వింగ్ లైసెన్సులు, ఆర్సీలు నిలిచిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా కార్యాలయాల్లో ఉన్న స్టాకు ప్రకారం ఖాళీ కార్డులను అందజేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో కార్డులు నిండుకోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
పట్టుబడితే జరిమానాలు
ఒకవైపు వాహన సవరణ చట్టంలో నిబంధనలు కఠినతరంగా ఉండటంతో వాహనదారుల వద్ద సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం డ్రై వింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా నిర్ణీత సమయంలో కార్డులు చేతికి అందకపోవడంతో రోడ్డుపైకి రావాలంటేనే వాహనచోదకులు భయపడుతున్నారు. మరోవైపు పోలీసు, రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడతూ జరిమానాలు విధిస్తున్నారు. కార్డుల సరఫరాను పునరుద్ధరించడంలో రవాణాశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రమంతా ఇదే పరిస్థితి
కేవలం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కార్డుల సరఫరా నిలిచిపోయింది. పాత కాంట్రాక్టర్ గడువు పూర్తికావడంతో కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు తీసుకోవడంలో జాప్యం కావడంతోనే సమస్య తలెత్తింది. కార్డులు జిల్లాకు రావడానికి మరో 20 రోజులు సమయం పడుతుంది. – జె.రమేష్‌కుమార్, ఇన్‌చార్జి డీటీసీ, ఏలూరు
Advertisement
Advertisement