కుండపోత | heavy rain | Sakshi
Sakshi News home page

కుండపోత

Published Sun, Sep 4 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

కుండపోత

కుండపోత

బుట్టాయగూడెం : జిల్లాలో ఆదివారం కుండపోత వాన కురిసింది. ఏజెన్సీలోని కొండవాగులు వరదనీటితో పోటెత్తాయి. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా సాయంత్రం వరకూ వర్షం కురవడంతో మండలంలోని కే.ఆర్‌.పురం, అల్లి కాలువ, వీరన్న పాలెం, ఇప్పలపాడు సమీపంలోని జల్లేరువాగు, రామారావు పేట, పట్టినపాలెం సమీపంలోని వాగు, కోపల్లి సమీపంలోని కొవ్వాడ వాగులు పొంగిపొర్లాయి. అదేవిధంగా కొమ్ముగూడెం, కంగాలవారిగూడెం, కుమ్మరిగట్టు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లల్లోకి ప్రవేశించింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు నానా అవస్థ పడ్డారు. కొండవాగుల ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. తాళ్లచెరువు, బైనేరు వాగు, కొమ్ముగూడెం కాలువ, రెడ్డిగణపవరం కాలువ కళింగలు పొంగాయి. కుమ్మరిగట్టు సమీపంలో కొన్ని ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
జిల్లాలో 12.6 మి.మీటర్ల సరాసరి 
వర్షపాతం నమోదు
కొవ్వూరు : గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం 8 గంటల సమయానికి జిల్లాలో 12.6 మి.మీటర్లు సరాసరి వర్షపాతం నమోదైంది. బుట్టాయిగూడెం మండలంలో అత్యధికంగా 57.6 మి.మీటర్లు వర్షం కురిసింది. ఉండ్రాజవరంలో 43.6, కొయ్యలగూడెంలో 23.4, పెరవలిలో 32.8, తణుకులో 37.2, నల్లజర్లలో 28.4, పెనుమంట్రలో 16.8, తాడేపల్లిగూడెంలో 11.0, కుక్కునూరులో 14.2, వీరవాసరంలో 15.2, గోపాలపురంలో 12.2, వేలేరుపాడు లో17.4 మి.మీటర్లు చొప్పున నమోదైంది. ఇక మిగిలిన మండలాల్లో నామమాత్రంగా పది మి.మీటర్లు లోపు వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లి 3.2, నిడదవోలులో 9.0, ఇరగవరంలో 7.2, అత్తిలిలో 5.2, పాలకొల్లులో 5.8, భీమవరంలో 3.2, ఆచంటలో 9.4, పాలకోడేరులో 3.2, ద్వారకా తిరుమలలో 4.2 మి.మీటర్లు చొప్పున నమోదైంది. జిల్లాలో పలు చోట్ల భారీవర్షం పడగా కొన్ని చోట్ల మాత్రం చిరుజల్లులు మాత్రమే పడడం విశేషం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement