
దుర్గగుడిపై చంటిబిడ్డలకు పాలకేంద్రాలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మ దర్శనానికి చంటిబిడ్డలతో వచ్చిన తల్లుల కష్టాలు ఇక తీరనున్నాయి. అమ్మవారి సన్నిధిలో చంటిబిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయాలని దుర్గగుడి ఈవో సూర్యకుమారి ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శనివారం అమ్మవారి సన్నిధికి చేరుకున్న ఈవో సూర్యకుమారికి పలువురు చంటిబిడ్డల తల్లులు పిల్లలకు ఆరు బయట పాలు ఇవ్వడాన్ని గమనించారు. ఆలయ ప్రాంగణంలోని సమాచార కేంద్రంతో పాటు రాజగోపురం ఎదుట మరో కేంద్రాన్ని ఆదివారం నాటికి ఏర్పాటుచేయాలని ఇంజినీరింగ్ విభాగ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాలకేంద్రాలలో తల్లులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఎండ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈవో ఆదేశాలతో అధికారులు పాలకేంద్రాల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు.