గుంటూరు అత్తా శభాష్... మోదీ అభినందనలు
కోడలికి మరుగుదొడ్డి కానుక ట్వీటర్‌లో అభినందనలు తెలిపిన మోదీ
సత్తెనపల్లి: ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో అవసరానికి ఆరుబయటకు వెళ్లేందుకు నిత్యం ఇబ్బంది పడే ఆమె.. రేపు తన ఇంటికి వచ్చే కోడలు అలాంటి ఇబ్బందులు పడకూడదని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా స్వచ్ఛభారత్ మిషన్ స్ఫూర్తితో మరుగుదొడ్డి నిర్మించి వచ్చిన కోడలికి కానుకగా ఇచ్చి ప్రధాని నుంచి ప్రశంసలందుకుంది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన షేక్ అబ్బాస్ సత్తెనపల్లిలోని హెడ్‌పోస్టాఫీస్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య షంషూన్‌బేగం తన సోదరుడు సత్తార్ కుమార్తె సల్మాతో తన కుమారుడికి వివాహం చేయాలని నిశ్చయించింది. ఈ నేపథ్యంలో సత్తార్ షంషూన్‌బేగంలో చైతన్యం తీసుకొచ్చాడు. దీంతో ఆమె స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రభుత్వం ఇచ్చిన రూ. 12 వేలతోపాటు తన బంగారు ఆభరణాలను కుదువపెట్టి మరో రూ. 5వేలు తెచ్చి మరుగుదొడ్డి, స్నానాలగది నిర్మించింది.
ఆ తర్వాత షాజహాన్, సల్మాకు వివాహం చేశారు. ఇంటికి వచ్చిన కోడలికి షంషూన్‌బేగం మరుగుదొడ్డిని కానుకగా అందించింది. ఈ విషయాన్ని మండలాధికారులు ఢిల్లీకి చెందిన రోస్ అనే స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. ఆ సంస్థ ప్రతినిధి ప్రశాంతి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు బొల్లవరం వచ్చారు. వాస్తవమని తేలడంతో ఆ సంస్థ ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. కోడలిపై అత్త షంషూన్‌బేగం చూపిన ప్రేమకు ప్రధాని మోదీ ట్వీటర్‌లో ప్రశంసించారు.