అది మహిళల ప్రాథమిక హక్కు
న్యూఢిల్లీ: స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం అనే అంశం చర్చకు రాగానే ఎవరైనా పనిచేసే చోట లింగభేదం లేకుండా సమాన వేతనం ఇవ్వాలని ఠక్కున అనేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సహస్రాబ్దుల్లో 60 శాతం మంది దీనికే ఓటేశారని ‘ది గ్లోబల్ షాపర్స్’ వార్షిక సర్వే కూడా ఇటీవల వెల్లడించింది. ఇంట్లో మరుగుదొడ్లు, ముఖ్యంగా మహిళల సౌకర్యార్థం ఏర్పాటు చేసినప్పుడు నిజమైన సమానత్వం సాధించినట్లు అవుతుందనేది ఎంత మంది అంగీకరిస్తారో తెలియదు.
గ్రామీణ భారతంలో ఇప్పటికీ మహిళలు రోడ్డు పక్కన బహిర్భూమికి వెళుతున్నారంటే పౌరులుగా మనం సిగ్గు పడాల్సిందే. తెల్లవారకముందే లేదా చీకటి పడ్డాక బహిర్భూమికి మహిళలు వెళ్లడం ఎంత కష్టం. తేళ్లు, పాములు కరిచే ప్రమాదమే కాకుండా మానవ మృగాలు కూడా కాటువేసే ప్రమాదం వారికి పొంచి ఉంటుంది. దేశంలో టాయ్‌లెట్ల కన్నా సెల్‌ఫోన్లు పెరిగిపోయిన నేటి పరిస్థితుల్లో ఆలయాలకన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునివ్వడం ఎంతో సమంజసం.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ దేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని పదే పదే ఉద్బోధించారు. దేశంలో 63.60 కోట్ల మంది భారతీయులకు మరుగుదొడ్లు లేవనే విషయాన్ని గుర్తించిన ఆయన వీటి నిర్మాణం కోసం వంద కోట్ల డాలర్లను విడుదల చేశారు. ఇప్పటికీ దేశంలో 2.40 కోట్ల మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించిందని ఇటీవల ఆయన ఓ సందర్భంలో తెలిపారు. 2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం ఉండాల్సిందేనని ఆయన ఆశించారు. మరుగుదొడ్లు కలిగి ఉండడం మహిళల ప్రాథమిక హక్కుకాగా, వాటిని ఏర్పాటు చేయడం మనందరి బాధ్యత.
(ఢిల్లీలో ఆరు, ఏడు తేదీల్లో జరుగుతున్న భారత ఆర్థిక సమ్మేళనం సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రచురించిన వ్యాసం నుంచి)