బాసర వెళ్లొస్తూ మృత్యుఒడికి
♦ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్నాచెల్లెళ్లు
♦ రాయిలాపూర్‌లో విషాదం
♦ ఇద్దరు పిల్లల మృత్యువాతతో కుటుంబానికి తీరని శోకం
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు రాయిలాపూర్ వాసులు. మృతులిద్దరూ అన్నాచెల్లెలు కావడం.. బాసర ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరగడంతో ఆ కుటుంబం కన్నీరమున్నీరైంది. పేదరికంలోనూ పిల్లలిద్దరినీ బాగా చది విస్తున్నానని, ఇద్దరినీ ఒకేసారి కోల్పోయానంటూ తండ్రి నర్సింలు రోదించడం కంటతడి పెట్టించింది.
రామాయంపేట: దైవ దర్శనానికి వె ళ్లిన అన్నాచెల్లెళ్లను మృత్యువు కబళించడంతో మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది. ఉన్న ఇద్దరు పిల్లలు ప్రమాదం రూపంలో మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే... రాయిలాపూర్ గ్రామానికి చెందిన తాడెం నర్సింలు- మంజుల దంపతుల సంతానం నితీష్ (17), కూతురు రుచిత (14). నితీష్ హైదరాబాద్ ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా.. కూతురు రుచిత గ్రామంలోనే చదివి తొమ్మిదో తరగతి పాసైంది.
వేసవి సెలవుల్లో గడిపేందుకు తల్లి మంజుల పిల్లలిద్దరిని తీసుకొని ఐదు రోజుల క్రితం నిజామాబాద్‌లో ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లింది. నితీష్‌తోపాటు రుచిత తమ బంధువులతో కలిసి బుధవారం ఫుణ్యక్షేత్రమైన బాసర ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ఆటోను నవీపేట మండల శివారులో భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, మృతుల్లో రుచిత, నితీష్ ఉన్నారు. కాగా విషయం తెలియగానే తండ్రి నర్సింలు గుండెలు బాదుకుంటూ విలపించడంతో గ్రామస్తులు అతన్ని సముదాయించారు.
పేదరికంతో ఇబ్బందులపాలవుతున్నా నర్సింలు తన పిల్లలను మంచిగా చదివిస్తున్నాడని, ఉన్న ఇద్దరు పిల్లలు ఒకేసారి మృత్యువాత పడ్డారని, గామస్తులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. తమ స్నేహితుడు నితీశ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలియడంతో అతని స్నేహితులు తీవ్రంగా విలపించారు. అందరితో తలలో నాలుకలా ఉండే అన్నాచెల్లెళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు.