
నీకు అన్యాయం చేస్తున్నందుకు క్షమించు
శవమై తేలిన బీటెక్ విద్యార్థి
క్షమించమంటూ ప్రియురాలికి మెసేజ్
క్రికెట్ బెట్టింగ్‌లతో అప్పులపాలైనట్టు సమాచారం
పాలకొల్లు అర్బన్ : అదృశ్యమైన ఓ బీటెక్ విద్యార్థి శవమై గోదావరి కాలువలో తేలాడు. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని హనుమాన్ కాలనీకి చెందిన పోతురాజు వంశీప్రియ చక్రవర్తి(22) తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం సమీపాన ఓ ఇంజినీరింగ్ క ళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 10వ తేదీన అదృశ్యమయ్యాడు. ఈ మేరకు తండ్రి యుగంధర్ రాజానగరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా మంగళవారం యలమంచిలి-చించినాడ మధ్య గోదావరిలో వంశీప్రియ చక్రవర్తి శవమై తేలాడు. శరీరం కుళ్లిపోవడంతో వంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. వ్యసనాలకు బానిసైన చక్రవర్తి క్రికెట్ బెట్టింగ్‌లతో అప్పుల పాలైనట్టు సమాచారం.
‘తాను అప్పుల పాలయ్యానని, నీకు అన్యాయం చేస్తున్నందుకు క్షమించు’ అని తన ప్రియురాలికి సెల్‌లో చివరిసారిగా మెసేజ్ పెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. చక్రవర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యలమంచిలి ఎస్సై అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.