
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య బెట్టింగే కారణమా!
యలమంచిలి: క్రికెట్ బెట్టింగ్ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు కారణమైంది. విశాఖ జిల్లా యల మంచిలి పట్టణంలోని కోర్టుపేటకు చెందిన రమేష్ (22) అనే యువకుడు శనివారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఆదివారం వెలుగుచూసింది. కొందరు స్నేహితులు, సన్నిహితుల కథనం ప్రకారం.. అనకాపల్లి ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న రమేష్ ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు.
స్నేహితులతో కలిసి బెట్టింగ్‌కు పాల్పడటంతో దాదాపు రూ.25 వేల వరకు బకాయిపడ్డాడు. బకాయిపడిన సొమ్ము తో పాటు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా కొంత మొత్తాన్ని ఏటీఎం కార్డు ద్వారా డ్రాచేసి నష్టపోయాడు. ఇది తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు చక్కగా చదువుకోకుండా బెట్టింగ్‌లాంటి ప్రమాదకర జూదానికి అలవాటు పడటం మం చిదికాదని మందలించారు.
తర్వాత బెట్టింగ్‌లో ఓడిపోయిన సొమ్మును ఇవ్వాలంటూ స్నేహితుల నుంచి ఒత్తిడి రావడం, అది తీర్చే ఆర్థిక స్తోమత లేకపోవడం, బెట్టింగ్ ఆడుతున్నట్లు అందరికీ తెలిసిపోవడం మానసికంగా కుంగదీసింది. తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బెట్టింగ్ బంగార్రాజులు, బుకీలు పట్టుబడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. కాగా, ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.