భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ ముట్టడి
భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ ముట్టడి
Published Mon, Mar 6 2017 10:40 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
కాకినాడ సిటీ : డిమాండ్ల పరిష్కారం కోరుతూ సీఐటీయూ అనుబంధ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక‌్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ముట్టడించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులు బాలాజీచెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు గంటల సేపు కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహరావు మాట్లాడుతూ అనేక సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసేవిధంగా వ్యవహరిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను చంద్రన్న బీమాలో కలపరాదని, సంక్షేమబోర్డు నిధులను పక్కదారి పట్టించకూడదని డిమాండ్ చేశారు. పక్కదారి పట్టించిన రూ.400 కోట్లు నిధులను తిరిగి సంక్షేమ బోర్డుకు జమ చేయాలని, పెండింగ్ క్లైములు పరిష్కరించాలని, కేంద్ర చట్టంలో ఉన్న అన్ని సదుపాయాలను రాష్ట్రంలో అమలు చేయాలని, ఇతర రాష్ట్రాలతో సమానంగా పరిహారాలను పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బేబీరాణి, ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మొలుగు వేణుగోపాల్, ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కరణం విశ్వనాథం, జిల్లా అధ్యక్షుడు గడిగట్ల సత్తిబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరా సత్తిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు విపర్తి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement