నిర్మాణ రంగం కుదేలు! | huge damge for construction sector | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగం కుదేలు!

Published Tue, Nov 15 2016 2:32 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

నిర్మాణ రంగం కుదేలు! - Sakshi

నిర్మాణ రంగం కుదేలు!

నగదు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు
కూలీలు రాకపోవడంతో నిలిచిపోయిన పనులు

♦  అన్ని పెద్ద పట్టణాల్లో ఆగిపోయిన బహుళ అంతస్తుల నిర్మాణాలు
♦   పనికి వెళితే పాత పెద్ద నోట్లు ఇస్తున్నారంటున్న కూలీలు
♦   ఆ నోట్ల మార్పిడి కోసం మరుసటి రోజు బ్యాంకు దగ్గరే పడిగాపులు
♦   పాల బూతులు, హోటళ్లలో చిల్లర సమస్యతో నష్టపోతున్న జనం
♦   సమకూరుతున్న చిల్లరతో కమీషన్ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు
♦   చిల్లర ఇవ్వలేక దుకాణాలు మూసేసుకుంటున్న వ్యాపారులు

సాక్షి, హైదరాబాద్‌
పెద్ద నోట్ల రద్దు కారణంగా అనేక రంగాలు సంక్షోభంలో పడిపోతున్నాయి. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ పరిమితుల కారణంగా నిర్మాణ రంగం కుదేలవుతోంది. కూలీలకు చెల్లించేందుకు కొత్త నోట్లు అందుబాటులో లేవు. పాత నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తూ కూలీలు పనులకు రావడం లేదు. ఫలితంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం నగరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చురుగ్గా సాగుతున్న కొన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆగిపోయింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు పొదుపు, కరెంట్‌ ఖాతాదారులకే నగదు ఉపసంహరణకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక ఉపసంహరణ పరిమితుల వల్ల కార్పొరేట్, ఇన్ఫ్రా, ఇతర రంగాలకు చెందిన కంపెనీలకు నగదు సమస్య తలెత్తింది. ఈ నెల 24వ తేదీ దాకా వారికి నగదు ఉపసంహరణకు అవకాశమివ్వవద్దని రిజర్వ్‌ బ్యాంకు ఆదేశించడం గమనార్హం. ఔషధ కంపెనీలకు మినహా ఏ ఇతర రంగాలకు నగదు ఉపసంహరణకు అవకాశమివ్వడం లేదని... మరీ అత్యవసరమైతే రూ.50 వేల వరకు అవకాశం ఇస్తున్నామని రిజర్వు బ్యాంక్‌ అధికారి ఒకరు చెప్పారు.

కూలీలకు ‘పెద్ద’నోట్లే..
పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడం కోసం కాంట్రాక్టర్లు పలు చోట్ల కూలీలపై ఒత్తిడి తెచ్చి.. కూలీ సొమ్ముగా పాత పెద్ద నోట్లు ఇస్తున్నారు. ఇలా ఒక రోజు కూలీ చేసి పెద్ద నోట్లు తీసుకుంటే వాటిని మార్చుకోవడానికి మరో రోజంతా బ్యాంకు దగ్గర పడిగాపులు పడాల్సివస్తోందని కూలీలు ఆవేదన చెందుతున్నారు. దాంతో పనులకు వెళ్లడమే మానుకుంటున్నారు. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోనే భవన నిర్మాణ కూలీలకు రోజుకు సగటున రూ.2.5 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు నిర్మాణ సామగ్రికి రోజూ పాతిక కోట్ల దాకా ఖర్చు చేస్తారు. అయితే కాంట్రాక్టర్లు, సంస్థలు నిర్మాణ సామగ్రి సమకూర్చుకున్నా కూలీలు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ‘‘అనుకున్న సమయానికి అపార్టుమెంట్లు నిర్మించి ఇవ్వకపోతే కొనుగోలుదారులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 15 రోజులు పని ఆగిపోతే దాని ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా ఉంటుంది..’’అని బిల్డర్స్‌ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు.

నల్లధనాన్ని మార్చుకొనేందుకూ..!
నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోవడానికి బిల్డర్ల దగ్గర నగదు లేకపోవడంతో పాటు మరో కారణం కూడా ఉంది. నల్లధనం పోగేసుకున్నవారు తాము దాచిపెట్టిన సొమ్ములో ఎంతో కొంత నగదు మార్చుకోవడానికి అడ్డా కూలీలను వినియోగించుకుంటున్నారు. ఆధార్‌కార్డు ఉంటే చాలు వారికి రోజుకు రూ.500 ఇస్తామని మాట్లాడుకుని.. బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబెట్టి రూ.4,000 విలువైన పాత పెద్ద నోట్లను మార్పిడి చేయించుకుంటున్నారు.

చిల్లరతో ‘పెద్ద’వ్యాపారం
కేంద్రం ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ వరకూ పెట్రోల్‌ బంకుల్లో పాత పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతాయి. కానీ పెట్రోల్‌ బంకుల సిబ్బంది వినియోగదారులకు దారుణమైన టోపీ పెడుతున్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదు, తీసుకున్నా తగిన చిల్లర ఇవ్వడం లేదు. రూ.500 నోటు ఇచ్చి 100 రూపాయల పెట్రోల్‌ పోయించుకుంటే మిగతా రూ.400 ఇవ్వకుండా... యాభై, వందా కమీషన్ తీసుకుని రూ.300, రూ.350 ఇస్తున్నారు. నోటు చెల్లడమే గగనమనుకున్న వారు దీనికి సరేనంటున్నారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లోనూ.. కొన్ని చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు, దుకాణాలతోపాటు కొందరు వ్యాపారులు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. వినియోగదారుల నుంచి పాత పెద్ద నోట్లు తీసుకోవడం లేదు. వ్యాపారం నుంచి వారికి సమకూరిన చిల్లర నోట్లను 10 నుంచి 15 శాతం కమీషన్కు అమ్ముకుంటున్నారు.

చిరు వ్యాపారులకు కష్టాలు
ఏ రోజుకారోజు నగదు చెల్లించి వస్తువులు తెచ్చి, వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు నగదు పెద్ద సమస్యగా తయారైంది. వారానికి రూ.24 వేలు మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో వారికి దానితో రెండు రోజులకు సరిపడా సామగ్రి కూడా రావడం లేదు. ‘‘నేను వారానికి రూ.50 వేలకుపైగా విలువైన సరుకులు తెచ్చి అమ్మేవాడిని. ఇప్పుడు వారానికి రూ.20 వేల సరుకులంటే.. అవి రెండు రోజులకు కూడా సరిపోవడం లేదు. దీంతో మిగతా రోజులు దుకాణాన్ని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది..’’అని ఎల్‌బీ నగర్‌కు చెందిన ఓ కిరాణ వ్యాపారి వాపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే దుకాణం అద్దెకు కూడా డబ్బులు రావేమోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌లో తప్పని కష్టాలు
బ్యాంకుల బంద్‌.. ఏటీఎంలలో నగదు నిల్వలు లేకపోవడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో సోమవారం కూడా జనం తీవ్ర అవస్థలు పడ్డారు. కార్తీక పౌర్ణమి కావడంతో మార్కెట్లకు పోటెత్తిన జనానికి చిల్లర లేక ఒకవైపు.. నిత్యావసరాల ధరలను వ్యాపారులు అమాంతం పెంచేయడం మరోవైపు పట్టపగలే చుక్కలు చూపించాయి. చాలా మంది పాత రూ.500, రూ.వెయ్యి నోట్లతో మార్కెట్లకు రావడంతో వ్యాపారులు ఇదే అదనుగా కూరగాయలు, పూల ధరలను పెంచేశారు. రూ.వెయ్యికి చిల్లర ఇస్తే రూ.100 కమీషన్గా దండుకున్నారు. ఇక చిరు వ్యాపారులు వినియోగదారులకు చిల్లర ఇవ్వలేక సామగ్రి విక్రయించుకోలేకపోయారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు ఏడు వేల ఏటీఎం కేంద్రాలుండగా.. అందులో సోమవారం రెండు వేలు మాత్రమే తెరుచుకున్నాయి. వాటిల్లోనూ నగదు పెట్టిన గంట, రెండు గంటల్లోగా ఖాళీ అయిపోయాయి. దీంతో భారీ క్యూలైన్లలో నిల్చున్న జనం నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు పాత పెద్ద నోట్లతో చెల్లింపులను అనుమతించడంతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, సీపీడీసీఎల్‌ తదితర విభాగాలకు వసూళ్లు భారీగా పెరిగాయి. ఆయా విభాగాలకు మొత్తంగా గత నాలుగు రోజుల్లోనే సుమారు రూ.400 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement