’కూలి’న ఆశల సౌధం | currency ban effect | Sakshi
Sakshi News home page

’కూలి’న ఆశల సౌధం

Published Sun, Dec 18 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

’కూలి’న ఆశల సౌధం

’కూలి’న ఆశల సౌధం

నిర్మాణ రంగంపై నోట్ల రద్దు ప్రభావం 
సంక్షోభంలో క్వారీ పరిశ్రమ 
అభివృద్ధి పనులకూ బ్రేక్‌ 
పనుల్లేక నలిగిపోతున్న కార్మికులు  
 
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో కార్మికుల ఆశల సౌధం కూలిపోయింది. నిర్మాణ రంగం, క్వారీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఫలితంగా పనుల్లేక కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. 
 
కొవ్వూరు : నోట్ల రద్దు ప్రకటన తర్వాత నిర్మాణ రంగం కుదేలైంది. పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వివిధ గ్రాంట్లతో ప్రభుత్వం చేపట్టిన సిమెంటు రోడ్లు, భవనాల నిర్మాణం, ఇతర పనులను కాంట్రాక్టర్లు నిలిపివేశారు. అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణాలూ నామమాత్రంగానే సాగుతున్నాయి. ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.దీంతో జిల్లాలో కంకర అమ్మకాలు 80శాతం పడిపోయాయి. క్వారీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. క్వారీ, క్రషర్‌ కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. పూర్తిస్థాయిలో నగదు అందుబాటులోకి రాకపోవడం, ప్రతి లావాదేవీకీ లెక్కలు చూపాల్సి ఉండడం వంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో నిర్మాణ సామగ్రి విక్రయాలు సగానికి పడిపోయాయి. ఫలితంగా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి నాలుగు వందల సిమెంటు బస్తాలు అమ్మే వాళ్లమని, నోట్లు రద్దు తర్వాత వంద » బస్తాలు కూడా పోవడం లేదని కొవ్వూరు పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఆందోళన. గతంలో వారంలో పదిటన్నుల ఐరన్‌ అమ్ముడైతే ప్రస్తుతం టన్ను కూడా విక్రయించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్మాణ సామగ్రి అమ్మకాలు రోజుకి సుమారు రూ.250 కోట్ల మేర స్తంభించినట్లు అంచనా.
 
2.50లక్షల మంది కార్మికులు ఉసూరు 
    జిల్లా వ్యాప్తంగా సుమారు 1.72 లక్షల మంది కార్మిక శాఖ ద్వారా గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంతో తాపీమేస్త్రీలు, కాంక్రీటు కార్మికులు, పెయింటర్స్, సెంట్రింగ్, రాడ్‌ బెండింగ్‌ వర్కర్ల ఉపాధి పూర్తిగా దెబ్బతింది. వీరికి తోడు నిర్మాణ రంగానికి సంబంధించిన క్వారీలు, క్రషర్లు, రవాణా వాహనాలపై పనిచేసే కార్మికులతోపాటు పరోక్షంగా ఆధార పడిన కార్మికులు మొత్తంగా సుమారు 65 వేల మంది ఉన్నారు. మొత్తంగా భవన నిర్మాణంపై ఆధారపడిన  సుమారు రెండున్నర లక్షల మంది కార్మికుల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగింది.  
 
పడిపోయిన కంకర విక్రయాలు:
 గతంలో రోజుకు 100నుంచి 150 యూనిట్ల కంకర విక్రయించే ఒక్కో క్రషరులో ఇప్పుడు ఇరవై యూనిట్లు మించి అమ్మకాలు సాగడం లేదు. దీంతో ధర అమాంతం పడిపోయింది. నోట్లు రద్దుకు ముందు కంకర ధర యూనిట్‌ రూ.2,300 నుంచి రూ.2,400 ఉండేది. ప్రస్తుతం రూ.1,900 లకు పడిపోయింది.లోడింగ్‌తో కలిపి యూనిట్‌ రూ.2వేలు పలుకుతోంది. 
 
సంక్షోభంలో క్వారీ పరిశ్రమ:
  జిల్లాలో నల్లరాతి కంకర పరిశ్రమ సంక్షోభంలో పడింది. జిల్లా వ్యాప్తంగా 135 క్వారీలు, 120 క్రషర్లు లు ఉన్నాయి. అమ్మకాలు పడిపోవడంతో క్వారీ కార్మికుల ఉపాధిపైనా ప్రభావం కనిపిస్తోంది. దీనికి తోడు కార్వీ, క్రషర్‌ కార్మికులతో యాజమాన్యం మూడేళ్లకు ఒకసారి చేసుకునే వేతన ఓప్పందం జనవరి 2, 8వ తేదీలతో ముగిస్తుంది. వేతన సవరణతోపాటు సంక్రాంత్రికి ప్రతి కార్మికుడికీ యాజమాన్యం నెల జీతం బోనస్, దుస్తులు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఒక్కో క్వారీ, క్రషరుకు రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతోంది. పెద్ద క్వారీలైతే రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఈ సోమ్ములన్నీ కార్మికులకు చెక్‌రూపంలో గానీ, కార్మికుల ఖాతాల్లోగానీ జమ చేయాలని కార్మిక శాఖ నిబందన పెట్టింది. ప్రభుత్వం మంజూరు చేసే పనులు చేపట్టే కాంట్రాక్టుర్లు కంకర కొనుగోలుకు సంబంధిచిన మైనింగ్, సేల్స్‌టాక్స్, ఆదాయపన్నులను మినహాయించుకుని బిల్లులు చెల్లించే వారు.ఇప్పుడు విక్రయాలన్నింటికీ లెక్కలు చెప్పాల్సి ఉంది.దీంతో లావాదేవీలు ఖాతాల ద్వారా చేయాలన్న నిబంధన పెట్టారు. దీంతో కంకర ఎవరికి విక్రయించినా మైనింగ్, సేల్స్‌టాక్స్, ఆదాయపన్నులతో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో యూనిట్‌కు రూ.340  అదనంగా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకమైన ఇబ్బందులపై ఉభయ గోదావరి జిల్లాల క్వారీ, క్రషర్స్‌ యూనియన్‌ ఆదివారం రాజమహేంద్రవరం సమావేశమయ్యారు. ఇప్పుడు క్వారీ, క్రషర్ల క్రయ, విక్రయాలన్నీంటికీ బిల్లుల ద్వారానే చేయాలని నిర్ణయించారు. 
 
అమ్మకాలు పడిపోయాయి
నోట్ల రద్దు వల్ల 80శాతం కంకర విక్రయాలు పడిపోయాయి. దీంతో కంకర యూనిట్‌ ధర రూ.400 లు తగ్గిపోయింది. వ్యాపారం గణనీయంగా పడిపోయింది.అమ్మకాల్లేక పోవడంతో నిర్వహణ యాజమానులకు భారంగా మారింది. నోట్ల రద్దు ప్రభావంతో క్వారీ, క్రషర్లు యాజమానులకు తీవ్ర ఇబ్బందిగా ఉంది.  
 
ముదునూరి సూర్యనారాయణరాజు,క్రషర్‌ యాజమాని, దొమ్మేరు
 
ఉపాధి అవకాశాలు తగ్గాయి:
           నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.దీంతో భవన నిర్మాణ కార్మికులకు  పనుల్లేవు. ఉన్నా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. చిల్లర కొరత వేధిస్తోంది. ఈ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి.
మద్దూకూరి, దొరయ్య, కోశాధికారి, భవన నిర్మాణ కార్మిక సంఘం
 
కొత్త వేతన ఓప్పందం అమలు చేయాలి 
మూడేళ్లకు యాజమాన్యంతో కార్మికులు చేసుకునే వేతన ఓప్పందం గడువు ముగిసింది.జనవరి 2తో క్వారీ, 8తో క్రషర్‌ కార్మికులకు వేతన ఓప్పందం గడువు ముగుస్తుంది. కొత్త వేతన ఓప్పంద అమలు చేయాలి.నోట్లు రద్దు ప్రభావంతో క్వారీ, క్రషర్లలో కార్మికుల ఉపాధి సన్నగిల్లింది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఉపాధి అవకాశాలను పెంచాలి. ప్రతి సంక్రాంతికీ కార్మికులకు ఇచ్చే బోనస్‌లు చెల్లించాలి.
 
ఎస్‌కే మస్తాన్, క్వారీ కార్మికుల యూనియన్‌ నాయకులు, ఐ.పంగిడి
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement