bulding
-
కరోనా: నటుడి నివాస భవనానికి సీల్
కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. అదేవిధంగా దేశ ప్రజలు, అభిమానులకు కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి పలు సూచనలు, సలహాలను ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘తారక్ మెహతా కా ఓల్తా చాష్మా’ కామెడీషో నటుడు తన్మయ్ వెకారియా తను నివసించే బిల్డింగ్‌ను అధికారులు సీల్ చేశారని తెలిపారు. తను నివసించే బిల్డింగ్‌లో ఓ కురగాయల వ్యాపారి, మరో ముగ్గురికి కరోనా వైరస్ (కోవిడ్-19) పాజిటివ్ నిర్దారణ అయినట్లు పేర్కొన్నారు. ఈ భవనం 14 రోజలు పాటు స్వీయ నిర్భందంలో ఉండనుందని చెప్పారు. తను నివాసం ఉండే భవనంలో చేటు చేసుకున్న పరిస్థితిని చూస్తే ప్రతి ఒక్కరు భయంతో వైరస్ నుంచి తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. (కరోనాతో హాలీవుడ్ నటి మృతి) బిల్డింగ్‌ను సీల్ చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు తన్మయ్ వెకారియా అభినందనలు తెలిపారు. బిల్డింగ్ మొత్తాన్ని బీఎంసీ అధికారులు సానిటైజర్తో స్ప్రే చేశారని చెప్పారు. దీంతో తన్మయ్ వెకారియా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్లు తెలిపారు. అదేవిధంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ఎటువంటి ప్రయాణాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ బాధితులు చికిత్స కోసం సెవన్‌హిల్స్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. వైరస్ సోకిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 7,447 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, అందులో 239 మంది మృతి చెందారు. ఇక 642 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6,565 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
ఏపీ వ్యాప్తంగా 4వేల వార్డు సచివాలయాలు
-
4,000 వార్డు సచివాలయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పట్ణణ ప్రాంతాల్లో 4,000 వార్డు సచివాలయాల ఏర్పాటుకు మున్సిపల్‌శాఖ కసరత్తు చేస్తోంది. మరో వారం నుంచి పది రోజుల్లోనే వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు 81 వేల మంది వార్డు వలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటవుతాయి. వార్డు సచివాలయాలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. స్థానిక అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాల్లోని గదుల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయాలి. ఇవి అందుబాటులో లేని చోట ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ప్రైవేట్ భవనంలో ఓ గదిని అద్దెకు తీసుకోవాలి. వార్డు సచివాలయానికి ఫర్నీచర్‌ను ప్రభుత్వమే సమకూరుస్తుంది. కనిష్టంగా 4 వేలు.. గరిష్టంగా 6 వేల జనాభా.. జనాభా ఆధారంగా వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. కనిష్టంగా 4 వేలు, గరిష్టంగా 6 వేలు జనాభా ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం సాలీనా 1.098 శాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జనాభా ఐదు వేల కంటే అధికంగా ఉంటే అదనంగా మరో వార్డు సచివాలయం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి కంటే జనాభా తక్కువగా ఉంటే సమీప వార్డు సచివాలయానికి జత చేస్తారు. వార్డు సచివాలయాలను నిర్ణయించే సమయంలో మురికివాడల సరిహద్దులు చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వార్డు సచివాలయాలు ఏర్పాటైన తరువాత మున్సిపల్ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ విభాగం సాయంతో మ్యాప్ రూపొందించి సీరియల్ నంబర్లు కేటాయిస్తారు. వార్డు వలంటీర్లు స్థానిక పరిస్థితులు, సమస్యలపై వార్డు సచివాలయానికి రోజూ నివేదిక ఇవ్వాలి. వార్డు కో–ఆర్డినేటర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్ స్థాయికి తగ్గకుండా ఉండాలని నిర్దేశించారు. వీరిని మున్సిపల్ కమిషనర్ నియమిస్తారు. విధులు, బాధ్యతలు ఇవీ... ప్రజలకు సకాలంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చేలా వార్డు వలంటీర్లు కృషి చేయాలి. దీన్ని నిర్ధారించుకునేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తారు. విధుల నిర్వహణలో అలక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సచివాలయాల్లోని కో–ఆర్డినేటర్ మున్సిపల్ కమిషనర్‌కు నివేదిక అందజేస్తారు. దీని ఆధారంగా వలంటీర్‌పై క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. 1.70 లక్షలకు చేరుకున్న దరఖాస్తులు పట్టణ ప్రాంతాల్లో వార్డు వలంటీర్ల పోస్టులకు మంగళవారం సాయంత్రానికి 1.70 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం వీరి విద్యార్హతలను డిగ్రీ నుంచి ఇంటర్‌కు తగ్గించడంతోపాటు దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్న ప్రాంతాల్లో 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వార్డు వలంటీర్, ఇతర ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించాలని నిర్ణయించడంతో వీరి సంఖ్య 81 వేలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వంద మార్కులకు ఇంటర్వూ్య వార్డు వలంటీర్ల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వూ్యల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 మార్కులు, బీసీ, ఓసీ అభ్యర్థులకు 40 మార్కులు చొప్పున వస్తే వారిని అర్హులుగా ప్రకటించనున్నారు. ఈమేరకు నియామక అర్హతలపై మున్సిపల్ శాఖ మంగళవారం ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. వంద మార్కులకు నిర్వహించే ఈ ఇంటర్వూ్యలో ఒక్కో విభాగానికి 20 మార్కులు చొప్పున ఐదు విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. చైర్మన్‌తోపాటు మరో ఇద్దరు సభ్యులు ఇంటర్వూ్యలను నిర్వహిస్తారు. వేర్వేరుగా మార్కులు నిర్ణయించి అనంతరం ఎంపిక కమిటీ చైర్మన్ వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని అర్హులను ప్రకటిస్తారు. అభ్యర్థి ప్రధానంగా అదే వార్డుకు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ప్రభుత్వ పథకాలు, వర్తమాన రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి. గతంలో ప్రభుత్వ సంస్థల్లో, ఎన్జీవోల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను మున్సిపల్ కమిషనర్లు నోటీసు బోర్డులో పొందుపరచాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. -
మేడపై ఫ్యాక్షన్ నీడ!
► బెజవాడలో అనంతపురం జిల్లా టీడీపీ నేతల దందా ► రూ.3కోట్ల భవనాన్ని దక్కించుకునేందుకు బరితెగింపు ► ఫ్యాక్షన్ యువనేత ఆగడాలతో బెంబేలు ► అనుచరులను ముందుపెట్టి వీరంగం ► బాధితుడి ఫిర్యాదుతో ఐదుగురి అరెస్ట్ సాక్షి, అమరావతిబ్యూరో : పక్క ఫొటోలో ఉన్న రెండస్తుల భవనం చూశారా... విజయవాడ గవర్నర్‌పేటలో ఉన్న ఈ భవనం రాజధానిలో అధికార టీడీపీ ఫ్యాక్షన్ పడగ నీడ పడిన విలువైన ఆస్తులకు తాజా తార్కాణం. ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతల దందాలతోనే నగరవాసులు హడలిపోతున్నారు. అది చాలదన్నట్లు అనంతపురం టీడీపీ ఫ్యాక్షన్ గద్దలు కూడా నగరంపై పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన కీలక నేత కుమారుడు, టీడీపీ యువనేత నేరుగా రంగప్రవేశం చేయడంతో రాజధానిలో టీడీపీ దందాలకు పరాకాష్టగా మారింది. న్యాయవివాదంలో ఉన్న ఓ భవనాన్ని అనంతపురం జిల్లాకు చెందిన ఒకరు తక్కువ ధరకు కొనుగోలు చేయడం... అనంతరం ఖాళీ చేయాలని ఆ ఇంట్లో ఉన్నవారిని బెదిరించడం... ఏకంగా ఇంటిపై దాడికి దిగడం తీవ్ర కలకలంరేపుతోంది. ఫ్యాక్షన్ యువనేత కన్నుపడింది... విజయవాడ గవర్నర్‌పేటలోని ఓ రెండు అంతస్తుల భవనంపై న్యాయవివాదం కొనసాగుతోంది. కుమ్మిలి రేణుకకు చెందిన ఆ భవనంలో ఎన్నో ఏళ్లుగా గార్లపాటి లీలా మల్లికార్జునరావు అద్దెకు ఉంటున్నారు. ఆ భవనాన్ని ఖాళీ చేయించే విషయంలో వారి మధ్య వివాదం ఏర్పడింది. దాంతో న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.3కోట్లు ఉన్న ఆ భవనాన్ని అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత కుమారుడి కన్నుపడింది. ఫ్యాక్షన్ రాజకీయాలతో అనంతపురం జిల్లాతోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆయన సెటిల్మెంట్ దందాలతో చెలరేగిపోతున్నారు. ఆ భవనంపై వివాదాన్ని అవకాశంగా తీసుకుని తక్కువ ధరకు దక్కించుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలోనే కమ్మిలి రేణుక మనవడు వెంకట నాగరాజు ఆ భవనాన్ని అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పాతపల్లికి చెందిన పూజారీ వేణుగోపాల్‌కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ వేణుగోపాల్ సదరు ఫ్యాక్షన్ యువనేతకు అత్యంత సన్నిహితుడని గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఆ భవనాన్ని ఖాళీ చేయాలని మల్లికార్జునరావుపై ఒత్తిడి తెస్తున్నారు. న్యాయవివాదంలో ఉన్న భవనం కొనుగోలుకు ఒప్పందం ఎలా చేసుకుంటారని ఆయన ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. న్యాయస్థానం తుది తీర్పునకు కట్టుబడతానని చెప్పారు. కానీ వారు ససేమిరా అన్నారు. యువనేత పేరుతో కొన్ని రోజులుగా బెదిరిస్తుండటంతో మల్లికార్జునరావు పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. యువనేత పాత్ర ఉందని తెలియడంతో పోలీసులు సకాలంలో స్పందించలేదు. భవనంపైకి ఎక్కి బరితెగింపు ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ యువనేత వర్గం సోమవారం నేరుగా యాక్షన్‌లోకి దిగింది. మల్లికార్జునరావు నివాసం ఉంటున్న ఆ భవనానికి పూజారి వేణుగోపాల్‌తోపాటు అనంతపురం జిల్లాకు చెందిన కుమార్, నాగేంద్ర, నారాయణ అనే వ్యక్తులు వచ్చారు. నేరుగా భవనం రెండో అంతస్తుపైకి ఎక్కి శ్లాబ్‌కు రంద్రాలు చేయసాగారు. ఇంటిని కూల్చివేస్తున్నామని చెబుతూ భీతావాహ వాతావరణం సృష్టించారు. యువనేత పేరు ప్రస్తావిస్తూ తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని చెప్పడం గమనార్హం. దీంతో బెంబేలెత్తిపోయిన మల్లికార్జునరావు త్రీ టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివాదాస్పద భవనాన్ని విక్రయానికి ఒప్పందం చేసుకున్న కమ్మిలి నాగరాజు, పూజారి వేణుగోపాల్‌లతోపాటు కుమార్, నాగేంద్ర, నారాయణలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు 323, 427, 452, 536 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఉదంతంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాజధాని ప్రాంతంలో పెట్రేగిపోతున్న అధికార టీడీపీ నేతల భూదందాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. మున్ముందు పరిస్థితులు మరెంతగా దిగజారుతాయోనని సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. -
భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ ముట్టడి
కాకినాడ సిటీ : డిమాండ్ల పరిష్కారం కోరుతూ సీఐటీయూ అనుబంధ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ముట్టడించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులు బాలాజీచెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు గంటల సేపు కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహరావు మాట్లాడుతూ అనేక సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసేవిధంగా వ్యవహరిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను చంద్రన్న బీమాలో కలపరాదని, సంక్షేమబోర్డు నిధులను పక్కదారి పట్టించకూడదని డిమాండ్ చేశారు. పక్కదారి పట్టించిన రూ.400 కోట్లు నిధులను తిరిగి సంక్షేమ బోర్డుకు జమ చేయాలని, పెండింగ్ క్లైములు పరిష్కరించాలని, కేంద్ర చట్టంలో ఉన్న అన్ని సదుపాయాలను రాష్ట్రంలో అమలు చేయాలని, ఇతర రాష్ట్రాలతో సమానంగా పరిహారాలను పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బేబీరాణి, ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మొలుగు వేణుగోపాల్, ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కరణం విశ్వనాథం, జిల్లా అధ్యక్షుడు గడిగట్ల సత్తిబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరా సత్తిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు విపర్తి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కొంప ముంచిన ఆకతాయితనం
పాఠశాల భవనం పై నుంచి దూకి విద్యార్థికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం.. కాకినాడ ఆసుపత్రికి తరలింపు పెద్దాపురం : ఆకతాయితనంతో పాటు సినిమా స్టంట్ల ప్రభావంతో ఓ విద్యార్థి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నాడు. పెద్దాపురం పట్టణంలోని జవహార్ లాల్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి, స్థానిక కబడ్డీ వీధికి చెందిన గోకేటి మణికంఠ(14) పాఠశాల పై అంతస్తు నుంచి దూకి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు పెద్దాపురం ప్రభుత్వాçస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ జీజీహె చ్‌కు తరలించారు. సహచర వి ద్యార్థులు, స్థానికుల కథనం ప్రకారం మణికంఠకు తం డ్రి లేకపోవడంతో తల్లి నాగమణి ఆమె తండ్రి సత్తిరాజు ఇంటి వద్దనే ఉంచి తన కుమారుడు మణికంఠ, కుమార్తెను ఇక్కడే చదివిస్తోంది. పాఠశాలకు వస్తూనే అందరితో ఆకతాయి బెట్టింగ్‌లు, స్నేహితుల తో చాలెంజ్‌లు చేయడం మణికంఠ నిత్యకృత్యం. రెండు రోజుల నుంచి మేడపై నుండి దూకేస్తానంటూ సహచర విద్యార్థులకు చెప్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి చేయి కోసుకుని చూపించాడు. అయినప్పటికీ సహచర విద్యార్థులు హేళనగా దూకుతానంటాడు కానీ దూకడనేలోగానే మణికంఠ పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకేసాడు. దీంతో అతని చాతికి, చేతికి బలమైన గాయమైంది. వెంటనే హెచ్ఎం రామారావు, స్థానికులు మణికంఠను ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకుపొమ్మని చెప్పడం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పెద్దాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై అనుమానాలు...? విద్యార్థి మేడపై నుంచి దూకేసిన ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చూస్తున్నారు. రెండు పీరియడ్ల మధ్యలో ఉపాధ్యాయుడు వచ్చేలోగా విద్యార్థి మేడపై నుంచి దూకేయడంపై అ ధ్యాపకుల క్రమశిక్షణ ఏమాత్రం ఉందో అర్థమౌతోంది. ఆకతాయితనం, సహచర విద్యార్థులు రెచ్చగొట్టడంతో పాటు ఓ అమ్మాయితో అల్లరిగా ప్రవర్తించడానికే గొప్పకుపోయి తిప్పలు తెచ్చుకున్నాడని చెబుతున్నారు. ఘటన విషయాన్ని విద్యార్థి తల్లికి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించగా ఆమె వేరే గ్రామం వెళ్లడం , ఆ కారణం వల్ల మధ్యాహ్నమే ఆత్మహత్యాయత్నంగా చెయ్యి కోసుకుని పాఠశాలకు రావడం జరిగింది. అయినా అధ్యాపకులు అతన్ని అడగకపోవడం పలు అనుమానాలు తావిస్తున్నది. విద్యార్థి కొలుకుంటే ఈ ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. -
7న నిర్మాణ కార్మికుల సదస్సు
కాకినాడ సిటీ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ రంగ కార్మికుల సదస్సు ఈ నెల 7న నిర్వహిస్తున్నట్టు సంఘ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం స్థానిక వేంకటేశ్వర నగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను సమీకరించి రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ తిలక్‌వీధిలోని పైడా వెంకట చలపతి కల్యాణ మండపంలో జరిగే ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.