మేడపై ఫ్యాక్షన్ నీడ!
► బెజవాడలో అనంతపురం జిల్లా టీడీపీ నేతల దందా
► రూ.3కోట్ల భవనాన్ని దక్కించుకునేందుకు బరితెగింపు
► ఫ్యాక్షన్ యువనేత ఆగడాలతో బెంబేలు
► అనుచరులను ముందుపెట్టి వీరంగం
► బాధితుడి ఫిర్యాదుతో ఐదుగురి అరెస్ట్
సాక్షి, అమరావతిబ్యూరో : పక్క ఫొటోలో ఉన్న రెండస్తుల భవనం చూశారా... విజయవాడ గవర్నర్‌పేటలో ఉన్న ఈ భవనం రాజధానిలో అధికార టీడీపీ ఫ్యాక్షన్ పడగ నీడ పడిన విలువైన ఆస్తులకు తాజా తార్కాణం. ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతల దందాలతోనే నగరవాసులు హడలిపోతున్నారు. అది చాలదన్నట్లు అనంతపురం టీడీపీ ఫ్యాక్షన్ గద్దలు కూడా నగరంపై పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అనంతపురం జిల్లాకు చెందిన కీలక నేత కుమారుడు, టీడీపీ యువనేత నేరుగా రంగప్రవేశం చేయడంతో రాజధానిలో టీడీపీ దందాలకు పరాకాష్టగా మారింది. న్యాయవివాదంలో ఉన్న ఓ భవనాన్ని అనంతపురం జిల్లాకు చెందిన ఒకరు తక్కువ ధరకు కొనుగోలు చేయడం... అనంతరం ఖాళీ చేయాలని ఆ ఇంట్లో ఉన్నవారిని బెదిరించడం... ఏకంగా ఇంటిపై దాడికి దిగడం తీవ్ర కలకలంరేపుతోంది.
ఫ్యాక్షన్ యువనేత కన్నుపడింది...
విజయవాడ గవర్నర్‌పేటలోని ఓ రెండు అంతస్తుల భవనంపై న్యాయవివాదం కొనసాగుతోంది. కుమ్మిలి రేణుకకు చెందిన ఆ భవనంలో ఎన్నో ఏళ్లుగా గార్లపాటి లీలా మల్లికార్జునరావు అద్దెకు ఉంటున్నారు. ఆ భవనాన్ని ఖాళీ చేయించే విషయంలో వారి మధ్య వివాదం ఏర్పడింది. దాంతో న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.3కోట్లు ఉన్న ఆ భవనాన్ని అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత కుమారుడి కన్నుపడింది.
ఫ్యాక్షన్ రాజకీయాలతో అనంతపురం జిల్లాతోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆయన సెటిల్‌మెంట్ దందాలతో చెలరేగిపోతున్నారు. ఆ భవనంపై వివాదాన్ని అవకాశంగా తీసుకుని తక్కువ ధరకు దక్కించుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలోనే కమ్మిలి రేణుక మనవడు వెంకట నాగరాజు ఆ భవనాన్ని అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పాతపల్లికి చెందిన పూజారీ వేణుగోపాల్‌కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు.
ఆ వేణుగోపాల్ సదరు ఫ్యాక్షన్ యువనేతకు అత్యంత సన్నిహితుడని గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఆ భవనాన్ని ఖాళీ చేయాలని మల్లికార్జునరావుపై ఒత్తిడి తెస్తున్నారు. న్యాయవివాదంలో ఉన్న భవనం కొనుగోలుకు ఒప్పందం ఎలా చేసుకుంటారని ఆయన ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. న్యాయస్థానం తుది తీర్పునకు కట్టుబడతానని చెప్పారు. కానీ వారు ససేమిరా అన్నారు. యువనేత పేరుతో కొన్ని రోజులుగా బెదిరిస్తుండటంతో మల్లికార్జునరావు పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. యువనేత పాత్ర ఉందని తెలియడంతో పోలీసులు సకాలంలో స్పందించలేదు.
భవనంపైకి ఎక్కి బరితెగింపు
ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ యువనేత వర్గం సోమవారం నేరుగా యాక్షన్‌లోకి దిగింది. మల్లికార్జునరావు నివాసం ఉంటున్న ఆ భవనానికి పూజారి వేణుగోపాల్‌తోపాటు అనంతపురం జిల్లాకు చెందిన కుమార్, నాగేంద్ర, నారాయణ అనే వ్యక్తులు వచ్చారు. నేరుగా భవనం రెండో అంతస్తుపైకి ఎక్కి శ్లాబ్‌కు రంద్రాలు చేయసాగారు. ఇంటిని కూల్చివేస్తున్నామని చెబుతూ భీతావాహ వాతావరణం సృష్టించారు. యువనేత పేరు ప్రస్తావిస్తూ తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని చెప్పడం గమనార్హం.
దీంతో బెంబేలెత్తిపోయిన మల్లికార్జునరావు త్రీ టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివాదాస్పద భవనాన్ని విక్రయానికి ఒప్పందం చేసుకున్న కమ్మిలి నాగరాజు, పూజారి వేణుగోపాల్‌లతోపాటు కుమార్, నాగేంద్ర, నారాయణలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు 323, 427, 452, 536 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఉదంతంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాజధాని ప్రాంతంలో పెట్రేగిపోతున్న అధికార టీడీపీ నేతల భూదందాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. మున్ముందు పరిస్థితులు మరెంతగా దిగజారుతాయోనని సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.