⇒ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
⇒ సూర్యాపేటలో పార్టీ రాష్ట్రకమిటీ సమావేశాలు ప్రారంభం
సూర్యాపేట: ప్రధాని నరేంద్రమోదీ అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలతో భారతదేశంలో ఐక్యత ప్రశ్నార్థకంగా మారిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి తిప్పికొట్టాలి.. కానీ అలా కాకుండా దేశ ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా వ్యవహరిస్తే సీపీఎం చూస్తూ ఉండదని హెచ్చరించారు. భారత పాలకులు సైన్యాన్ని అప్రమత్తం చేయడంలో లోపాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉడీలో ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంటే ఎన్డీయే ప్రతినిధి ప్రతిపక్షాలపై విరుచుకు పడడంలో అర్థం లేదన్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద దాడులను తిప్పికొట్టామని.. అయినా గోప్యంగా ఉంచామని ఓ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు దాడులు చేసేప్పుడు నిద్రపోయి.. అయిపోయాక మాట్లాడడం మోదీ, రక్షణశాఖ మంత్రులకే చెల్లుబాటవుతుందని ఎద్దేవా చేశారు. సరిహద్దుల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరముందని బీవీ రాఘవులు సూచించారు.
'మోదీ విధానాలతో ఐక్యత ప్రశ్నార్థకం'
Published Wed, Oct 5 2016 10:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
Advertisement