ఉప ఎన్నిక ప్రశాంతం
అనంతపురం న్యూసిటీ : తాడిపత్రి, హిందూపురం మున్సిపాలిటీలకు సంబంధించి రెండు స్థానాలకు జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. హిందూపురంలో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, పోలీసులు ఇరు వర్గాలను మందలించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. హిందూపురంలో 9వ వార్డు ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున రాధ, టీడీపీ తరఫున శాంత బరిలో దిగారు.
ఈ వార్డులో 2,576 ఓట్లకు గానూ 1,395 ఓట్లు పోలయ్యాయి. 54.15 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే తాడిపత్రి 4వ వార్డుకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున షబ్బీర్, టీడీపీ తరఫున లక్ష్మీదేవి, స్వతంత్య్ర అభ్యర్థి రియాజ్ బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 1,680 ఓట్లుండగా, 1,181 ఓట్లు పోలవగా, 70.29 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 10న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.