ప్రాథమికంగా గుర్తిస్తే క్యాన్సర్ దూరం
ప్రాథమికంగా గుర్తిస్తే క్యాన్సర్ దూరం
Published Wed, Oct 26 2016 8:49 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
- కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(హాస్పిటల్): ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా కర్నూలు క్యాన్సర్ సొసైటీ ఆధ్వర్యంలో పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి ఆమె పింక్ రిబ్బన్ వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ క్యాన్సర్‌కు గల కారణాలు, లక్షణాలు ముందుగానే గుర్తించి, అవగాహనతో ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, దానిని సరైన చికిత్సతో దూరం చేసుకోవచ్చన్నారు. ప్రధానంగా యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత జీవనశైలిలో మార్పు తెచ్చుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావాలన్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ రోగుల కోసం కర్నూలులో రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. క్యాన్సర్ లక్షణాలు, చికిత్సల గురించి డాక్టర్ రవీంద్రబాబు వివరించారు. కార్యక్రమంలో క్యాన్సర్ సొసైటీ అధ్యక్షుడు జి. పుల్లయ్య, సభ్యులు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, డాక్టర్ భవానీప్రసాద్, డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ అల్లారెడ్డి, డాక్టర్ ఇందిర, ఎమ్మెల్యే సతీమణి విజయ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement