అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులను కేంద్రాలుగా విశాఖ గంజాయిని గల్ఫ్ దేశాలకు అక్రమరవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను కడప పోలీసులు పట్టుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట ఓఎస్డీ(ఆపరేషన్స్) సత్య ఏసుబాబు వెల్లడించిన వివరాలివీ.. తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన కంచు సూరిబాబు, తాకాసి వెంకటేశ్వర్లు విశాఖ ఏజెన్సీ నుంచి రాజంపేటకు గంజాయిని దొంగతనంగా తరలించేవారు.
దానిని రాజంపేట ప్రాంతానికి చెందిన తల్లిశెట్టి సాయిప్రతాప్ ఉరఫ్ తపన హరి, చంద్ర సుబ్రమణ్యం, రొంపిచెర్ల హరి, రొంపిచెర్ల లక్ష్మీకర్, రొంపిచెర్ల నాగభూషణం, షేక్ అక్బర్, నాగిరెడ్డి మదన్‌మోహనరెడ్డి, తిరుచానూరుకు చెందిన శ్రీనువాసులరెడ్డి, ఇంకా మరికొందరు కలిసి గల్ఫ్‌కు వెళ్లేవారిని గుర్తించి వారిద్వారా తరలించేవారు.
ఎగుమతి సాగేదిలా..
రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువమంది జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వె ళుతుంటారు. ఎవరెవరు వెళ్తున్నారో ముందుగా ఈ ముఠా గుర్తిస్తుంది. చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు చేరుకుని వారి కోసం అక్కడ కాపుకాస్తారు. అందులో అమాయకంగా కనిపించేవారిని ఎంచుకుని మాటల్లోకి దించుతారు. తమ బంధువులు కువైట్, దుబాయిలో ఉన్నారని, వారికి ఈ ప్యాకెట్ అందజేయాలని అంటగడతారు.
దీంతో వారెవరో తమకు తెలియకపోయినా సీల్డు కవర్లలో ప్యాక్ చేసిన వాటిని తమ వెంట తీసుకెళ్తుంటారు. అంతా సాఫీగా సాగితే అక్కడి స్మగ్లర్లకు సరుకు చేరుతుంది. అలాకాకుండా ఎయిర్‌పోర్టు అధికారుల తనిఖీలో పట్టుబడితే మాత్రం అమాయకులు జైలుపాలయ్యేవారు. ఇలా చాలామంది అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు కూడా. ఇలా ఈ ముఠా సభ్యులు గంజాయిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు. ముఠా సభ్యుల్లో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు గురువారం రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద పదిమందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో ఇద్దరు తప్పించుకోగా వారి కోసం గాలింపుచేపట్టారు.