కారు ఢీకొని వివాహిత దుర్మరణం
Published Tue, Mar 21 2017 2:10 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
భీమడోలు: జాతీయ రహదారిపై భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద సోమవారం సాయంత్రం మోటార్ సైకిల్‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో వివాహిత దుర్మరణం పాలైంది. టి.నరసాపురం గ్రామానికి చెందిన వివాహిత పుట్టాల జ్యోతి (32) మృత్యువాత పడగా భర్త, ముగ్గురు పిల్లలు గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం గ్రామానికి చెందిన దంపతులు పుట్టాల సతీష్, జ్యోతి ముగ్గురు పిల్లలతో కలిసి ఆదివారం మండలంలోని పూళ్ల పంచాయతీ ఎం ఎం పురంలోని బంధువుల ఇంటికి వ చ్చారు. పెద్దింట్లమ్మ తీర్థానికి వెళ్లి సరదాగా గడిపారు. సోమవారం సాయంత్రం ఎంఎం పురం నుంచి టి.నరసాపురం మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద డివైడర్ వైపు నుంచి గేటు వైపు వెళుతుండగా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మోటార్‌సైకిల్‌పై ఉన్న వారంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. జ్యోతి తలకు తీవ్రగాయమైంది. సతీష్, పిల్లలు చాందిని, రాజేశ్వరి, వెంకట ఫణీంద్రకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతి కన్నుమూసింది. తల్లిని కోల్పోయిన పిల్లల రోదనలు మిన్నంటాయి. భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement