బ్రిడ్జిని ఢీకొన్న కారు
-
వ్యక్తి దుర్మరణం
సూళ్లూరుపేట : కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొన్న ప్రమాదంలో ఇస్రో విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డులో కుదిరి–అటకానితిప్ప మధ్యలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నైలోని ఇస్రో అతిథి భవనంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన శివాజీ (64), ఝాన్సీరాణి దంపతులు శ్రీహరికోటలోని కామాక్షమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసుకునేందుకు చెన్నై నుంచి ఈ నెల 1న సూళ్లూరుపేటలోని తన స్నేహితుడు వీరాస్వామి ఇంటికి వచ్చారు. రెండు రోజులు ఇక్కడే ఉన్నారు. బుధవారం శివాజీ, ఝాన్సీరాణి, వీరాస్వామి,వాణి దంపతులు శ్రీహరికోటలోని కామాక్షమ్మకు పూజలు చేసుకుని తిరిగి కారులో వస్తుండగా అదుపుతప్పి బ్రిడ్జికి ఢీకొంది. కారు డ్రైవింగ్ చేస్తున్న శివాజీ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న ఝాన్సీరాణి, వీరాస్వామి, వాణితో పాటు మరో గుర్తు తెలియని మహిళ తీవ్రంగా గాయపడ్డారు. కారులో వస్తుండగా పేరు తెలియని ఓ మహిళ లిప్ట్ అడగడంతో ఎక్కించుకున్నారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా షార్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన శివాజీ మృతదేహాన్ని స్థానిక గ్లోబల్ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి కుమారుడు, కుమార్తె ఇద్దరు అమెరికాలో ఉండడంతో వారు వచ్చేవరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచి వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్సై జీ గంగాధర్‌రావు తెలిపారు.