సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది
– నయా పైసా విదల్చకున్నా ఇన్నోవా కార్లపై చంద్రన్న బొమ్మలు
– గృహ నిర్మాణాల్లోనూ అదే తీరు
– మండిపడుతున్న బీజేపీ వర్గాలు
కర్నూలు(అర్బన్): సాయం చేసేది ఒకరైతే.. ప్రచారం పొందేది మరొకరులా ఉంది .. రాష్ట్రప్రభుత్వ తీరు. అనేక ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది తన సొంత పథకంలా ప్రచారం చేసుకోవడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరుతో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రచారాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటాను మాత్రం స్పష్టం చేయడం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం, ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం(గ్రామీణ్) పేరుతో మూడేళ్ల పాలనలో జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా గృహ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
1.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఎన్‌టీఆర్ గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.55 వేలను అందిస్తోంది. అలాగే రూ.2 లక్షలతో ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం (గ్రామీణ్) కింద చేపడుతున్న గృహాలకు రూ.58 వేలను ఉపాధి నిధుల ద్వారా సమకూరుస్తోంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న హౌస్ ఫర్ ఆల్ స్కీంలో కూడా రూ.1.50 లక్షలను కేంద్రం భరిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తానే అంతా భరిస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా.. ఎస్‌సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ ( నేషనల్ షెడ్యూల్డు క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ) పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతోంది. అయితే ఈ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేయడం పలువరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎస్‌సీల ఆర్థికాభివృద్ధి కోసం ఈ పథకం కింద అనేక రకాల యూనిట్లు ఉన్నాయి. ఇందులో ట్రాన్స్‌పోర్టు సెక్టార్ కింద ఇన్నోవా కార్లను అర్హులైన ఎస్‌సీ నిరుద్యోగులకు అందిస్తున్నారు. ఒక ఇన్నోవా కారు విలువ రూ.20 లక్షలు కాగా, ఇందులో కేవలం 2 శాతం అంటే రూ.20 వేలను లబ్ధిదారుడు భరించాల్సి ఉంది. 35 శాతం సబ్సిడీ పోగా, మిగిలిన 63 శాతం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తోంది.
అయితే కేంద్రం నుంచి లబ్ధిదారునికి ఈ నిధులను అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి పాత్రను పోషిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఏకంగా ఎస్‌సీ లబ్ధిదారులకు ఇస్తున్న ఇన్నోవా కార్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను ముద్రించుకున్నారు. ఆయా కార్లపై చంద్రబాబు ఫోటోలు ఉండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దళిత వర్గాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారానికి సంబంధించి చంద్రబాబు ప్రచారమేంటని ప్రశ్నిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ఫోటోను ముంద్రించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు: కె.కపిలేశ్వరయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా చిత్రీకరించుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ద్రోహం చేస్తున్నారు. అనేక పథకాలకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తోంది. అయితే అంతా తానే చేస్తున్నట్లు చంద్రబాబు.. ప్రచారాలు చేసుకోవడం సరైన విధానం కాదు. ఎస్‌సీలకు ఇస్తున్న ఇన్నోవా కార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నయాపైసా లేకపోయినా.. చంద్రబాబు ఫొటోలు ముద్రించడం.. ‘థ్యాంకు సీఎం సార్’ అని రాయడం..ప్రజలను మభ్యపెట్టడమే.