NTR housing
-
సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది
– నయా పైసా విదల్చకున్నా ఇన్నోవా కార్లపై చంద్రన్న బొమ్మలు – గృహ నిర్మాణాల్లోనూ అదే తీరు – మండిపడుతున్న బీజేపీ వర్గాలు కర్నూలు(అర్బన్): సాయం చేసేది ఒకరైతే.. ప్రచారం పొందేది మరొకరులా ఉంది .. రాష్ట్రప్రభుత్వ తీరు. అనేక ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది తన సొంత పథకంలా ప్రచారం చేసుకోవడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరుతో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రచారాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటాను మాత్రం స్పష్టం చేయడం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం(గ్రామీణ్) పేరుతో మూడేళ్ల పాలనలో జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా గృహ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 1.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.55 వేలను అందిస్తోంది. అలాగే రూ.2 లక్షలతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం (గ్రామీణ్) కింద చేపడుతున్న గృహాలకు రూ.58 వేలను ఉపాధి నిధుల ద్వారా సమకూరుస్తోంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న హౌస్ ఫర్ ఆల్ స్కీంలో కూడా రూ.1.50 లక్షలను కేంద్రం భరిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తానే అంతా భరిస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా.. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్ఎస్ఎఫ్డీసీ ( నేషనల్ షెడ్యూల్డు క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ) పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతోంది. అయితే ఈ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేయడం పలువరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసం ఈ పథకం కింద అనేక రకాల యూనిట్లు ఉన్నాయి. ఇందులో ట్రాన్స్‌పోర్టు సెక్టార్ కింద ఇన్నోవా కార్లను అర్హులైన ఎస్సీ నిరుద్యోగులకు అందిస్తున్నారు. ఒక ఇన్నోవా కారు విలువ రూ.20 లక్షలు కాగా, ఇందులో కేవలం 2 శాతం అంటే రూ.20 వేలను లబ్ధిదారుడు భరించాల్సి ఉంది. 35 శాతం సబ్సిడీ పోగా, మిగిలిన 63 శాతం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తోంది. అయితే కేంద్రం నుంచి లబ్ధిదారునికి ఈ నిధులను అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి పాత్రను పోషిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఏకంగా ఎస్సీ లబ్ధిదారులకు ఇస్తున్న ఇన్నోవా కార్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను ముద్రించుకున్నారు. ఆయా కార్లపై చంద్రబాబు ఫోటోలు ఉండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దళిత వర్గాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారానికి సంబంధించి చంద్రబాబు ప్రచారమేంటని ప్రశ్నిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ఫోటోను ముంద్రించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు: కె.కపిలేశ్వరయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా చిత్రీకరించుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ద్రోహం చేస్తున్నారు. అనేక పథకాలకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తోంది. అయితే అంతా తానే చేస్తున్నట్లు చంద్రబాబు.. ప్రచారాలు చేసుకోవడం సరైన విధానం కాదు. ఎస్సీలకు ఇస్తున్న ఇన్నోవా కార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నయాపైసా లేకపోయినా.. చంద్రబాబు ఫొటోలు ముద్రించడం.. ‘థ్యాంకు సీఎం సార్’ అని రాయడం..ప్రజలను మభ్యపెట్టడమే. -
ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి
– పలువురు ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు కర్నూలు (అర్బన్): ఎన్టీఆర్ గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించకపోవడంపై జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ భవనంలో ఆయన హౌసింగ్ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. గతేడాది సెప్టెంబరు నెలలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రారంభమైనా, ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వారంలోగా మంజూరైన ఇళ్లు వంద శాతం గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ హుసేన్ సాహెబ్, ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడా కక్కుర్తే..!
♦ ఐఏవై ఇళ్లను కుదించిన రాష్ట్ర సర్కార్ ♦ సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తుగడ ♦ {పజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరిట కేంద్రం మంజూరు చేసిన ఐఏవై ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కుదించేసింది. తద్వారా సబ్సిడీ భారం రాష్ట్రంపై పడకుండా సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలతో హుద్‌హుద్ బాధితులకు తీవ్ర నష్టం జరగనుంది. మరోవైపు ఈ నిర్ణయంపై ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నూతన మార్గదర్శకాలతో జాబితాలో అర్హులను తొలగిస్తే నియోజకవర్గాల్లో తిరగలేమని వారు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ తుఫాన్‌కు ఒక్క విశాఖలోనే లక్షా 18 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. నేటికీ వేలాది మంది నిలువ నీడ లేక పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్నారు. ఐఏవై కింద 66,390 ఇళ్ల కోసంకేంద్రానికి ప్రతిపాదనలు పంపితే.. యూనిట్ కాస్ట్ రూ.75 వేల అంచనాతో జిల్లాకు 16,890 మంజూరు చేసిం ది. కాగా ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ర్టంలో రెండు లక్షల గృహాలు నిర్మిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న సర్కా ర్.. హుద్‌హుద్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖకు కేవలం 1,821 ఇళ్లను మాత్రమే మంజూరు చేసింది. ఇప్పటికే దాతల సహకారంతో ఆరువేల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నందున.. ఐఏవై ఇళ్లలో కోత పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు మంజూరైన 16,890 ఐఏవై ఇళ్లను 9,929 ఇళ్లకు కుదించేసింది. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో మంజూరు చేసిన 1,821 ఇళ్లతో కలిపి మొత్తం 11,750 ఇళ్లను యూనిట్ కాస్ట్ రూ.2.75లక్షలతో నిర్మించాలని నిర్ణయిం చింది. యూనిట్ కాస్ట్లో ఎస్సీ, ఎస్టీలకైతే సబ్సిడీ రూపంలో రూ.37,500 కేం ద్రం, రూ.1.37,500 రాష్ర్టం భరించనుండ గా, మరో లక్ష రుణం రూపం లో మంజూరు చేయనుంది. ఇతరులకైతే కేం ద్రం రూ.37,500, రాష్ర్టం రూ.87,500 భరించనుం డగా, రూ. 1.50 లక్షలు రుణంగా అందజేయనుం ది. అంటే కేంద్రం వాటా పోను.. రాష్ర్టం సబ్సిడీ భరించాల్సి ఉంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఐఏవై ఇళ్ల కింద మంజూరు చేసిన సొమ్మును సర్దుబాటు చేసుకుని ఇళ్ల సంఖ్య కుదించిందనే వాదన విన్పిస్తోంది. ఐఏవై ఇళ్లను కుదించడం వల్ల కేంద్రం వాటా, రుణం పోగా జిల్లాకు మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి రాష్ర్టంపై అదనంగా పడే భారం కేవలం రూ.65 కోట్ల లోపే ఉంటుందని అంచనా. హుద్ హుద్ బాధితులకు తీవ్ర నష్టం జిల్లా వ్యాప్తంగా హుద్‌హుద్ బాధితుల కోసం కేంద్రం ఐఏవై ఇళ్లు మంజూరు చేసింది. కానీ ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం మార్గదర్శకాలను పరిశీలిస్తే 75 శాతం పూర్తిగా ఒకే ప్రాంతంలో లే అవుట్ సైట్లోనై నిర్మించాలి. గ్రామా ల్లో ఇళ్లు నిర్మించుకోకుండా అక్కడక్కడా ఉన్న లబ్ధిదారుల్లో కేవలం 25 శాతం మందికి మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన హుద్‌హుద్‌కు బాధితులకు నష్టం జరిగే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత మరొక పక్క ఇప్పటికే ఐఏవై కింద మంజూరైన ఇళ్ల కోసం ఎమ్మెల్యేల నుంచి 4,488 ప్రతిపాదనలు అందగా, వీటిలో ఇప్పటికే 1,050 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. నియోజకవర్గానికి రెండువేల ఇళ్ల వరకు కేటాయించగా.. సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో వీటి సంఖ్య సగానికి తగ్గిపోనుంది. పైగా మార్గ దర్శకాలు పుణ్యమాని అర్హుల జాబితాలో చాలాపేర్లు తొలగించాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఇప్పటికే మంజూరైన ఐఏవై ఇళ్లను రూ.75 వేల యూనిట్ కాస్ట్‌తో నిర్మిస్తారో లేక రూ.2.75లక్షల యూనిట్‌కాస్ట్‌తో నిర్మిస్తారో మీ ఇష్టం.. కానీ జిల్లాకు మంజూరైన 16,890 ఇళ్లను కుదించడానికి వీల్లేదని’ వారు పట్టుబడుతున్నారు. అలా చేస్తే నియోజకవర్గాల్లో తిరగలేమని..ఇప్పటికే ఎంపిక చేసిన వారికి ఏం సమాధానం చెబుతామని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా చర్చ జరగడంతో కుదించిన 5,140 ఇళ్లను జిల్లాకు అదనంగా మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది.