దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీస్ కొరియర్ల పోలీస్ కొరియర్ల పేరుతో మావోయిస్టులు గిరిజనులను కిడ్నాప్ చేయడంతో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు గ్రామాల్లో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీసులు మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడం, ప్రతీకారంగా మావోలు పోలీసులపై కాల్పులు జరిపి హతమార్చడం వంటి ఘటనలు ఇటీవల చోటుచేసుకున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో మావోయిస్టు కొరియర్లపై పోలీసులు డేగకన్ను వేశారు. కాగా మావోయిస్టులు కూడా తొట్టెంతోగు ఎన్‌కౌంటర్‌పై విచారణ పేరుతో కొందరు గిరిజనులను కిడ్నాప్ చేశారు. పోలీస్ కొరియర్లను గుర్తించి మావోయిస్టులు కిడ్నాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు గిరిజనులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు దుమ్ముగూడెం ఎస్‌ఐ కడారి ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు వాహన తనిఖీలు విస్తృతంగా చేయడంతో పాటు సరిహద్దులో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు దండకారణ్యం దాటి తెలంగాణలోకి రాకుండా గట్టి జాగ్రత్తలు చేపట్టినట్లు సమాచారం.అటు మావోలు ఇటు పోలీసులు ప్రతీకారంతో రగిలిపోతూ వేస్తున్న ఎత్తులతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో ఎవరి నుంచి ఏ ముప్పు వస్తుందో అని వణికిపోతున్నారు. కొందరు గిరిజనులు ఇళ్ల వద్ద ఉండకుండా బయట ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అప్రమత్తమైన పోలీసులు
Published Wed, Mar 16 2016 9:09 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement