
వలసలపై ప్రత్యేక దృష్టి పెట్టండి..చంద్రబాబు
విజయవాడ: పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు సహచర నేతలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసి నైతికంగా బలహీన పరిచేందుకు ప్రతిరోజూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేలా ప్రణాళికలు రూపొందించటంతో పాటు చివరి వరకూ గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30 నుంచి 40 మందికి వివిధ కారణాలతో టిక్కెట్లు ఇవ్వలేమని, నియోజకవర్గాల పెంపు వల్ల మరో 50 సీట్లు అదనంగా వస్తాయని, ఇన్ని స్థానాలకు చివరి నిమిషంలో అభ్యర్ధులు దొరకటం కష్టం కాబట్టి ప్రతిపక్షం నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకునే పనిలో నేతలు నిమగ్నం కావాలని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, టీడీ జనార్ధనరావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు,విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరారవు, ఎస్‌స్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు, 20 సూత్రాల అమలు పథకం ఛైర్మన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ ఫిరాయింపులపైనే చర్చ జరిగింది. ఫిరాయింపులపై ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించినా ఎదురుదాడి చేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఫిరాయింపులు జరిగినపుడు స్పందించని పార్టీలు ఇపుడు తప్పుపట్టడమేంటని ప్రశ్నించటం ద్వారా గట్టిగా సమాధానం చెప్పాలని సమావేశంలో వివరించారు.
పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేయాలని, వారి రాజీనామాలను ఆమోదించాలని వైఎస్సార్‌సీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోవద్దని, ఒకవేళ వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా తీసి పక్కన పడేశాలా వ్యూహం రచించాలని నేతలకు చెప్పారు. గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినపై మనం ఫిర్యాదు చేస్తే అప్పటి స్పీకర్లు పట్టించుకోలేదని, తాజాగా తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై ఫిర్యాదు చేసినా అక్కడి స్పీకర్ పట్టించుకోకుండా పక్కన పడేశారని, కోర్టు ఫిరాయింపుల అంశాన్ని త్వరగా తేల్చాలని చెప్పినా స్పందించని విషయాన్ని సమావేశంలో చెప్పిన చంద్రబాబు అదే సూత్రాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పారు.
ఫిరాయింపులకు పాల్పడిన వారి రాజీనామాలను చివరి ఆరు నెలల్లో ఆమోదించేలా పార్టీ వ్యూహం ఉండాలని వివరించారు. పార్టీ కార్యకలాపాలను విజయవాడలో పెంచాలని, నేతలందరూ సాధ్యమైనంత త్వరగా విజయవాడకు మకాం మార్చాలని సూచించారు. ఈ నెల 29న తెలుగుదేశం శాసనసభపక్ష వ్యూహ కమిటీ సమావేశం విజయవాడలో జరగనుంది. అదే రోజు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది.