
చంద్రబాబుకు ముందే తెలుసు
పెద్దనోట్ల రద్దుపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
హాలియా: కేంద్ర ప్రభుత్వం రూ.1000, 500 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముందే తెలుసని ఏపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాచర్ల వెళ్తూ నల్లగొండ జిల్లా హాలియాలో తన మిత్రుడి వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నోట్ల కొరతను ముందుగా ఊహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే పేదలకు కష్టాలు ఉండేవికావన్నారు.
ఏపీలో దోపిడీ పాలన కొనసాగుతోందని, సీఎం కుమారుడు లోకేశ్ తెరచాటున పైరవీలు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని తిరిగి లీజుకు రారుుంచడంలో లోకేశ్ పాత్ర ఉందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వైఎస్ జగన్ ఏనాడూ పైరవీలకు తావివ్వలేదన్నారు. చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.