బాబుకు కోస్తాంధ్రపైనే ప్రేమ ఎక్కువ
శ్రీశైలం: 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమ కన్నా కోస్తాంధ్రపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు.. అందుకే శ్రీశైలం డ్యాం 854 అడుగులకు చేరకుండానే నీటిని విడుదల చేస్తున్నారు' అని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం రాయలసీమ రైతు సంఘాల నాయకులు ప్రాజెక్ట్ వద్ద ధర్నా నిర్వహించారు. శ్రీశైలం డ్యాం వద్దకు సుమారు 200 మంది రైతు సంఘం నాయకులు, రైతులు చేరుకుని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయలసీమ సాగు, తాగు నీటి సమస్యతో కటకటలాడుతోందని, అయినా కృష్ణా డెల్టాకు తాగునీటి పేరుతో నీటిని కిందకు వదులుతున్నారని వాపోయారు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల వరకు నీరు చేరితే కానీ.. రాయలసీమ రైతులకు నీరు అందదని తెలిపారు. సీఎం చంద్రబాబు రైతులపై కపట ప్రేమ కురిపిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రం మొత్తంపై చూపించాల్సిన ప్రేమను కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే చూపిస్తూ మరో ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.