టీడీపీ వెబ్సైట్ నుంచి చంద్రబాబు లేఖ తొలగింపు
హైదరాబాద్ : ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరపొద్దంటూ 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖను టీడీపీ అధికార వెబ్సైట్ శుక్రవారం తొలగించింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2011లో ఈ తవ్వకాలను తాము వ్యతిరేకమంటూ ఆయన బహిరంగ లేఖ రాశారు.
ఆనాటి చంద్రబాబు రాసిన లేఖను శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ముందు ఉంచింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ వైఖరి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే అప్రమత్తమైన అధికార టీడీపీ తమ వెబ్ సైట్ నుంచి చంద్రబాబు రాసిన లేఖను తొలగించింది.
బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం గురువారం జీవో నంబర్ 97 జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 8902 ఎకరాల్లోని 565 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలపై కన్నేసిన ప్రభుత్వం... మొదటి దశలో 3030 ఎకరాల్లో తవ్వకాలను అనుమతిచ్చేసింది. తద్వారా 223 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను వెలికి తీయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే గిరిజన సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టయినా సరే బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని తేల్చి చెప్పాయి.