పని చేయకపోతే పక్కన పెట్టేస్తా: చంద్రబాబు
విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పార్టీ ఎమ్మెల్యేలకు, జిల్లాల ఇంచార్జ్‌లకు క్లాస్ తీసుకున్నారు. మంగళవారం ఇక్కడ పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పని చేయకపోతే పక్కన పెట్టేస్తామని, పనితీరుతో పాటు, సర్వలు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు జరుగుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ‘నేతల పనితీరుపై సర్వేలు చేస్తున్నాం.. పనితీరు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం. విశాఖలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. అయినా ఆ ప్రాంతంలో సభ్యత్వం తక్కువగా ఉంది. ఇది సరైంది కాదు. ఇళ్ల పట్టాలిచ్చేశాం.. ఓట్లేస్తారని లైట్‌గా తీసుకోవద్దు’ అంటూ హెచ్చరించారు.
పార్టీలు మారి కొందరు, నియోజకవర్గాలు మారి ఇంకొందరు గెలుస్తున్నారని చంద్రబాబు అన్నారు. విభేదాలు వీడి అందరూ కలిసి పనిచేయకుంటే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. నేతలు చేసే తప్పులను ఉపేక్షిస్తే, పార్టీ మునుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఏకీకరణతోనే ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఎన్నికలు గెలుస్తున్నారని ఆయన పేర‍్కొన్నారు.