అవినీతి డబుల్ డిజిట్కు చేరింది: చంద్రబాబు
విజయవాడ : కొన్ని శాఖల్లో అవినీతి డబుల్ డిజిట్కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు డ్వాక్రా సంఘాలకు రీచ్లు అప్పగించినట్లు తెలిపారు. అయితే చాలాచోట్ల సమర్థవంతంగా పనిచేయటంలేదని, దీనిపై సమీక్షించాల్సి ఉందన్నారు.
నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత 'మీ ఇంటికి మీ భూమి' అమలు చేస్తామన్నారు. భూమికి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తే సంబంధిత వీఆర్ఓ, ఎమ్మార్వోలను బాధ్యులను చేస్తామని చంద్రబాబు తెలిపారు. అవినీతి ఎంత ప్రమాదకరమో అసమర్థత కూడా అంతే ప్రమాదకరమన్నారు. ప్రతి మూడు నెలల అభివృద్ధిని సమీక్షిస్తున్న విధానం దేశంలోనే ప్రథమం అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను చూసి కేంద్రం కూడా ఈ విధానంపై ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు.