చాలా అంశాల్లో వెనుకబడ్డాం
400 గ్రామాలకు తాగునీరు లేదు
* ఇసుక మాఫియాను అరికట్టలేకపోయాం
* కొన్ని శాఖలు అవినీతిలో రెండంకెల వృద్ధి సాధించాయి
* కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ప్రగతికి సంబంధించి అనేక అంశాల్లో వెనుకబడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాగునీటి సరఫరాలో ప్రజల సంతృప్తస్థాయి చాలా తక్కువగా ఉందని, 400 గ్రామాలకు అసలు నీరే లేదని, విద్యుత్తు సరఫరాలో అంతరాయలు వస్తున్నాయనీ, అర్హత ఉన్న వారికీ పింఛన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్టీఆర్ వైద్యసేవ అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
నగరంలోని ఒక హోటల్‌లో శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలు రద్దుకాని వారు రుణమాఫీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఏంచేస్తుందో ప్రజలకు సమాచారం చేరవేయకపోతే ఎలాగని సమాచార, పౌరసంబంధాల శాఖనుద్దేశించి వ్యాఖ్యానించారు.
వాటర్‌గ్రిడ్ ఏర్పాటు... : పట్టిసీమ ఎత్తిపోతల పథకం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైందన్నారు. దేశంలో పెట్టుబడులకు అనువైన రెండో రాష్ట్రంగా ఏపీని ప్రపంచ బ్యాంకు గుర్తించిందని, కానీ తాను ప్రపంచంలోని టాప్ ఐదు దేశాలు ఏంచేస్తున్నాయో గుర్తించి అందుకనుగుణంగా పనిచేస్తానన్నారు.
కలెక్టర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి
అధికారులు ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకోరని, చెబితే వాళ్లెక్కడ ముందుకెళ్లిపోతారోననే భయం చాలామందిలో ఉందన్నారు. తాగునీటి సరఫరాలో ప్రజల సంతృప్తస్థాయి చాలా తక్కువగా ఉందని చెబుతూ 400 గ్రామాలకు అసలు నీరే లేదని చెప్పారు.
అవినీతిలో ముందుకు... : రెవెన్యూ శాఖపై అవినీతి ముద్ర పడిపోయిందని, రెండంకెల వృద్ధిరేటు సాధించడానికి తాము ముందుకెళుతుంటే కొన్ని శాఖలు అవినీతిలో రెండంకెల వృద్ధిని సాధించాయని చెప్పారు. కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చినా అనుకున్న ఫలి తాలు రాలేదని, మాఫియాను నిరోధించలేకపోయామన్నారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వ లక్ష్యాలను వివరించగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రెండంకెల వృద్ధిని ఎలా సాధించాలనే దానిపై పలు సూచనలు చేశారు.
ఆటోమొబైల్ కార్మికులకు నైపుణ్య శిక్షణ
ఆటోమొబైల్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు కంపెనీలతో అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. విజ యవాడలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల నైపుణ్య శిక్షణ నిమిత్తం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆటోమొబైల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌల్సిల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ-కామర్స్‌కు సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫడా), కార్ దేఖో.కామ్ వెబ్‌సైట్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
తిరుపతి అభివృద్ధిపై దృష్టిపెట్టండి : సీఎం
సాక్షి, తిరుమల: తిరుపతి అభివృద్ధిపై దృష్టి సారించాలని టీటీడీకి సీఎం చంద్రబాబు నిర్దేశించారు. గురువారం ఉదయం తిరుమల నుం చి తిరుగు ప్రయాణానికి ముందు ఇక్కడి పద్మావతి అతిథిగృహంలో ధర్మకర్తల మండలి చైర్మ న్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, ఇతర అధికారులతో సీఎం సమావేశమయ్యారు. తిరుపతి నగరాన్ని పర్యాటక, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
తిరుపతి నగర కార్పొరేషన్, తుడతో కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. తిరుమల కేంద్రంగా జిల్లాలోని ఆల యాలన్నింటినీ అనుసంధానిస్తూ టెంపుల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు. తిరుమలలోని నిత్యాన్నప్రసాదం, విద్యాదా నం తరహాలోనే మిగిలిన క్షేత్రాలు ఆ పథకాలను అమలు చే సేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.