
'చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. దేశ సరిహద్దుల్లో కూడా లేనంతగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిషేధాజ్ఞలు విధించారని మండిపడ్డారు. ముద్రగడను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారని వాపోయారు.
దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తునా పోలీసులను మోహరించారని ధ్వజమెత్తారు. అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం రెచ్చగొట్టే విధానం మంచిది కాదన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించవచ్చు అని సూచించారు. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది కాబట్టి చంద్రబాబు సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని రఘువీరా కోరారు.