దారి మళ్లిన బునాది
ఆత్మకూరు(ఎం): బునాదిగాని కాల్వను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారం తవ్విన కాల్వ పనికిరాదంటూ కొత్తగా తవ్వకాన్ని ప్రారంభిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటన ఆత్మకూర్(ఎం)మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. 2006లో బునాదిగాని కాల్వ పనులను ప్రారంభించారు. అప్పట్లో రూపొందించిన డిజైన్ ప్రకారం తొలుత బునాది కాల్వ తీశారు. కాల్వ హైదరాబాద్‌కు చెందిన ఓ రైతు భూమి మధ్యలో నుంచి వెళ్లింది. దీని వల్ల భూమి ఎటు కాకుండా పోతుందని, తన భూమి గుండానే శివారు నుంచి కాల్వ తీస్తే బాగుంటుందని సదరు రైతు సంబంధిత అధికారులను ఆశ్రయించినట్లు పలువురు రైతులు ఆరోపించారు. దీంతో మంగళవారం ఉదయం జేసీబీతో సదరు రైతు సూచించిన విధంగా అతని భూమిలో నుంచి కాల్వ తీస్తుండగా సమీప రైతులు గడ్డం సత్యనారాయణ, గడ్డం స్వామి తదితరులు అడ్డుకున్నారు. కాల్వను దారి మళ్లిస్తే తమకు నష్టం జరుగుతుందని, గతంలో ఎలా ఉందో అదే విధంగా ఉంచాలని అక్కడకు వచ్చిన ఐబీ ఏఈ రఘును కోరారు. గతంలో తీసిన కాల్వ ద్వారా బీటీ రోడ్డుపై నిర్మించిన స్ట్రచ్చర్ గుండా నీళ్లు వెళ్లే అవకాశం లేనందున దానికి ఎదురుగా కాల్వ తీస్తున్నట్లు ఏఈ తెలిపారు. రైతులు మాత్రం పాత డిజైన్ ప్రకారం కాల్వ ఉండాల్సిందేనని పట్టుబట్టారు.