కల్తీ మద్యం సేవించి ఐదుగురి మృతి
విజయవాడ : విజయవాడలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. స్థానిక కృష్ణలంక నెహ్రు నగర్ లోని స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా.. మరో 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. బార్ ను సీజ్ చేశామని, లిక్కర్ ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమన్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ తెలిపారు. ఎక్సైజ్ అధికారులు మద్యం శాంపిల్స్ను సేకరించి బార్ను సీజ్ చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ...ప్రభుత్వ ఆస్పత్రిలో సందర్శించి సంఘటనపై ఆరా తీశారు. మృతుల వివరాలు....1. ఆకుల విజయ్ (46), 2. మీసాల మహేశ్ (40), 3. మునగాల శంకర్ రావు (45), 4. పరస గోపీ (48), 5. మాదాసు నాంచారయ్య (60)