స్కాలర్‌షిప్‌ అక్రమాలకు చెక్‌ | check for scholarship irregularities | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌ అక్రమాలకు చెక్‌

Published Thu, Jun 22 2017 6:06 PM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM

స్కాలర్‌షిప్‌ అక్రమాలకు చెక్‌ - Sakshi

స్కాలర్‌షిప్‌ అక్రమాలకు చెక్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : స్కాలర్‌షిప్‌ అక్రమాలకు ఇక తావుండదు. కళాశాలల యాజమాన్యాలు తప్పుడు లెక్కలు చూపి స్కాలర్‌షిప్‌ నిధులను పక్కదారి పట్టించే అవకాశమూ ఉండదు. స్కాలర్‌షిప్‌ల కోసమే కొందరు విద్యార్థులు కళాశాలల్లో చేరుతున్నారని, తరగతులకు హాజరుకావడం లేదనే అపవాదుకు ఆస్కారం ఉండదు. స్కాలర్‌షిప్‌ అక్రమాలకు చెక్‌ పెట్టేలా, పూర్తి పారదర్శకత కోసం ప్రభుత్వం జన్మభూమి వెబ్‌పోర్టల్‌ను రూపొందించింది. దీని ద్వారా స్కాలర్‌షిప్‌లు సులభతరం కావడంతో పాటు ఎటువంటి అవకతవకలకు ఆస్కారముండదని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు ఈ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనీ ఉండదంటున్నారు. 
కళాశాలల్లోనే దరఖాస్తు
గతంలో స్కాలర్‌షిప్‌ కావాలంటే విద్యార్థులు ఈ సేవ కేంద్రం, నెట్‌ సెంటర్‌లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేంది. ఒక్కోసారి సర్వర్‌ సక్రమంగా పనిచేయకపోతే రోజుల తరబడి కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ఇకపై అటువంటి కష్టాలు పడనక్కరలేదు. తాము చేరిన కళాశాలలోనే ఆన్‌లైన్‌లో జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా స్కాలర్‌షిప్‌లకు సంబంధిత కళాశాల యాజమాన్యమే దరఖాస్తు చేస్తుంది. దరఖాస్తులోని వివరాలను విద్యార్థి నింపితే మిగిలిన పని కళాశాల యాజమాన్యమే పూర్తిచేస్తుంది. సదరు విద్యార్థి కళాశాల యాజమాన్యానికి తెల్లరేషన్‌ కార్డు లేకపోతే ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువపత్రం, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ మొదటి పేజీ జిరాక్సుతో పాటు శాశ్వత మొబైల్‌ నెంబర్, ఈ మెయిల్‌ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. 201718 విద్యా సంవత్సరంలో కళాశాలల్లో చేరిన విద్యార్థులంతా (ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేసిన, చేయని) ప్రెష్‌ /రెన్యువల్‌ విద్యార్థులందరి వివరాలను సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన ప్రభుత్వం విధించింది. దీంతో స్కాలర్‌షిప్‌లకు అర్హులెవరనే విషయం ఉన్నతాధికారులకు సులభంగా తెలుస్తుంది. 
75 శాతం హాజరు ఉంటేనే..
జ్ఞానభూమి వెబ్‌సైట్‌ ద్వారా నమోదై స్కాలర్‌షిప్‌ పొందే విద్యార్థులకు 75 శాతం తప్పనిసరిగా హాజరు ఉండాలి. అనారోగ్య కారణాల వల్ల లేదా మరే ఇతర కారాణాల వల్ల ఒక నెలలో హాజరు శాతం తగ్గితే ఆపై నెలలో పూర్తిగా హాజరై రెండు నెలలకూ కలిపి 75 శాతం సగటు హాజరు చూపాల్సి ఉంటుంది. అప్పుడే రెండు నెలలకు కలిపి మెస్‌ చార్జీలు విడుదల చేస్తారు. విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌ విధానంలో నమోదు చేస్తున్నందున స్కాలర్‌షిప్‌ కావాల్సిన విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రతి నెలా మెస్‌ చార్జీలు విడుదల చేసినా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని మాత్రం మూడు నెలలకోసారి విడుదల చేస్తారు. తొలి మూడు క్వార్టర్లకు హాజరు శాతాన్ని బట్టి స్కాలర్‌షిప్‌లు విడుదల చేసినా నాల్గో త్రైమాసికం సొమ్ము మాత్రం విద్యార్థి రాసిన సెమిస్టర్‌ లేదా సంవత్సరాంతపు పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత విడుదల చేస్తారు. విద్యార్థుల ప్రదర్శన, ఫలితాలు సంతృప్తికరంగా లేకపోతే స్కాలర్‌షిప్‌ నిలిపివేసే ప్రమాదం ఉంది.
465 కళాశాలలు నమోదు
స్కాలర్‌షిప్‌ కావాలంటే కచ్చితంగా జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న 589 ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలల్లో 465 కళాశాలలు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాయి. మిగిలిన 124 కళాశాలలకు సంబంధించిన చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నమోదు చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. వారంలోపు ఆ కళాశాలలు కూడా ఆన్‌లైన్‌లో నమోదయ్యే అవకాశం ఉంది. 
డిజిటల్‌ సిగ్నేచర్‌ కీలు పంపిణీ చేస్తున్నాం
జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదైన కళాశాలలకు డిజిటల్‌ సిగ్నేచర్‌ కీలను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారు 100 కళాశాలలకు డిజిటల్‌ కీలు ఇచ్చాం. మిగిలిన కళాశాలలకు నాలుగైదు రోజుల్లో అందిస్తాం. నూతన విధానాన్ని అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక సామగ్రిని తగిన సమయంలో సమకూర్చుకోవాలని అన్ని కళాశాలలకు ఆదేశాలిచ్చాం. కలెక్టర్‌ చొరవతో డిజిటల్‌ సిగ్నేచర్‌ కీ పంపిణీ ప్రారంభించి, ముగించిన తొలి జిల్లాగా రాష్ట్రంలో పశ్చిమగోదావరి నిలుస్తుంది.
-జేఆర్‌ లక్ష్మీదేవి, డిప్యూటీ డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement