- రంగంలోకి దిగిన కీలక నేతలు
- కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ
నంద్యాల: ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రలోభాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికార పార్టీ ఆగడాలను అడ్డుకొని, కార్యకర్తలకు అండగా నిలబడటానికి వైఎస్‌ఆర్‌సీపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ప్రభుత్వం ప్రలోభాలకు దిగడం, రోజుకు ఇద్దరు మంత్రులు పర్యటించడం, కౌన్సిలర్ సుబ్బరాయుడిపై పోలీసుల దౌర్జన్యం తదితర వాటిని గమనించిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, కడప, కమలాపురం, నందికొట్కూరు, పాణ్యం, రైల్వే కోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు అమ్జాద్‌బాషా, రవీంద్రారెడ్డి, ఐజయ్య, గౌరుచరితారెడ్డి, శ్రీనివాసులు, గండికోట శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కడప, కర్నూలు జిల్లాల పార్టీ అధ్యక్షులు అమర్‌నాథరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, జమ్మలమడుగు ఇన్‌చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి, కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, అనంతపురం ఇన్‌చార్జి మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పత్తికొండ, ధర్మవరం, శ్రీశైలం ఇన్‌చార్జిలు చెరుకులపాడు శ్రీదేవి, వెంకటరామిరెడ్డి, బుడ్డా శేషారెడ్డి బుధవారం నంద్యాలకు చేరుకున్నారు.
వీరికి పార్టీ సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పార్టీ యువ నేత శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, సీనియర్ నేత కల్లూరి రామలింగారెడ్డి స్వాగతం పలికారు. తర్వాత పార్టీ అగ్రనేత బొత్స సత్యనారాయణ నంద్యాలకు వచ్చారు. ఆయనకు, గౌరువెంకటరెడ్డి, బీవై రామయ్యలకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వీరితో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, చైర్‌పర్సన్ దేశం సులోచన, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు సమావేశమయ్యారు. అనంతరం వీరు శిల్పా ఇంట్లో బస చేశారు.
కార్యకర్తలకు భరోసా
పోలీసులు భయభ్రాంతులకు గురి చేసిన కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంటిని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సందర్శించారు. ఆయనకు, చుట్టుపక్కల ఉన్న రజకులకు «ధైర్యం చెప్పారు. టీడీపీ ఆగడాలకు భయపడవద్దని ధైర్యంగా ఎదుర్కోవాలని తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.